Vijayawada: విజయవాడ నుంచి ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక రైలు ప్రారంభం

Vijayawada: విజయవాడ నుంచి గుజరాత్‌లోని వేరావల్ (సోమనాథ్) క్షేత్రానికి 1,060 మంది భక్తులతో బయల్దేరిన ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక రైలును ప్రముఖులు ప్రారంభించారు.

Satyanarayana, Vijayawada
Published on: 4 Oct 2026 2:59 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ నుంచి ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక రైలు ప్రారంభం

​​విజయవాడ: భారతదేశ భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ సోమనాథ్ దేవాలయంపై దాడి జరిగి వెయ్యేళ్లు (1000 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, అలాగే ఆలయ పునర్నిర్మాణం (1951) జరిగి 75 ఏళ్లు పూర్తయిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాదిపాటు (జనవరి 2026 నుండి జనవరి 2027 వరకు) ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ (Somnath Swabhiman Parv - 1000 Years of Unbroken Faith) నిర్వహిస్తోంది.

​ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మరియు భాషా-సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ (సోమనాథ్) క్షేత్రానికి బయల్దేరిన ప్రత్యేక రైలు యాత్రను ప్రముఖులు ఘనంగా ప్రారంభించారు.

​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & స్థానిక శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే . రామచంద్ర మోహన్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఆర్. మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

​యాత్ర ముఖ్య పరమార్థం:

​శ్రీ సోమనాథ దేవాలయం భారతీయ సాంస్కృతిక జీవనానికి, ఆత్మగౌరవానికి, తరగని అచంచల విశ్వాసానికి ప్రతీక. క్రీ.శ. 1026లో దాడికి గురైన ఆ పవిత్ర స్థలాన్ని స్వాతంత్ర్యానంతరం భారత జాతి 1951లో పునర్నిర్మించుకుంది. ఈ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న శుభవేళ, మన సాంస్కృతిక వైభవాన్ని, సమగ్రతను చాటేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్వాభిమాన యాత్రను తలపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్న భక్తులు, సాంస్కృతిక బృందాలు మన రాష్ట్ర ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని, కళా వైభవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పనున్నారు.

​విజయవాడ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేసిన వేదిక పై ప్రముఖులు తమ సందేశం అందించారు.

​ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు:

"సోమనాథ్ దేవాలయంతో ముడిపడి ఉన్న మన జాతి సాంస్కృతిక వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని ఘనంగా చాటడమే లక్ష్యంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చారిత్రక ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ యాత్రకు శ్రీకారం చుట్టాయి. భారతీయ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మిక జీవనం నిరంతరం వర్ధిల్లాలనే సమున్నత ఆశయంతో మన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజయవాడ గడ్డ నుండి 1,060 మందికి పైగా భక్తులు మన రాష్ట్ర ఆధ్యాత్మిక ప్రతినిధులుగా ఈ పవిత్ర క్షేత్రానికి బయల్దేరడం అత్యంత గర్వకారణంగా భావిస్తున్నాను. భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, సాంస్కృతిక శాఖలు అన్ని చర్యలూ చేపట్టాయి."

​రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ:

"ఏ రాష్ట్రంలోనైతే సంస్కృతి, కళలు వర్ధిల్లుతాయో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మన విజయవాడ నుంచి ఈ పవిత్ర యాత్ర ప్రారంభం కావడం అభినందనీయం. యాత్రికులంతా క్షేమంగా, సంతోషంగా వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగిరావాలని కోరుకుంటున్నాను.

​ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ:

"సోమనాథ క్షేత్రం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి, సాంస్కృతిక కొనసాగింపునకు నిదర్శనం. ఈ జాతీయ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావడం గర్వకారణం. భక్తుల సౌకర్యార్థం విజయవాడ నుంచి వేరావల్ వరకు 16 స్లీపర్, 2 ఎస్ఎల్ఆర్ బోగీలతో కూడిన 18 కోచ్‌ల ప్రత్యేక ఎఫ్‌‌టీఆర్ (FTR) రైలును నడుపుతున్నాం. కేంద్ర సాంస్కృతిక శాఖ, గుజరాత్ ప్రభుత్వం, ఐఆర్‌సీటీసీ (IRCTC), రైల్వే మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.

​దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కే . రామచంద్ర మోహన్:

"భారతదేశం మొత్తం అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించే సోమనాథ క్షేత్రంపై దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయింది. అదేవిధంగా ఆ ఆలయాన్ని మన జాతి పునర్నిర్మించుకుని 1951లో పూర్తి చేయగా, ఆ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు నిండాయి. మన యావత్ భారత భక్తి విశ్వాసాల్ని చాటడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 1,060 మంది భక్తులను వివిధ దేవాలయాల నుండి ఉచితంగా ప్రత్యేక రైలు ద్వారా పంపిస్తున్నాం. జాతి సమగ్రతను పరిరక్షించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దేవాదాయ, సాంస్కృతిక, రైల్వే శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం."

​సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఆర్. మల్లికార్జునరావు:

"ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమమైన సోమనాథుని దర్శించుకునే అవకాశం భక్తులకు లభించడం పూర్వజన్మ సుకృతం. గుజరాత్‌లో భక్తులకు రెండు రోజుల పాటు స్థానిక రవాణా, వసతి, ప్రసిద్ధ క్షేత్రాల దర్శన ఏర్పాట్లను అక్కడి ప్రభుత్వం సమకూరుస్తుంది. భక్తుల సౌలభ్యం, భద్రత కోసం ప్రతి 20-22 మందికి ఒక గ్రూప్ లీడర్‌ను, ప్రతి భోగీకి ప్రత్యేక పర్యవేక్షకులను నియమించి, దేవాదాయ, సాంస్కృతిక శాఖల అధికారులు నిరంతరం సమన్వయం చేస్తున్నారు."

​దేవాలయాల వారీగా తరలివెళ్లిన భక్తుల సంఖ్య (మొత్తం: 1,060 మంది):

​శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి - 52 మంది

​శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ద్వారకా తిరుమల - 52 మంది

​శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం - 50 మంది

​శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం - 52 మంది

​శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం, శ్రీశైలం - 74 మంది

​శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం - 42 మంది

​శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి - 57 మంది

​శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, బురుజుపేట - 33 మంది

​శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అరసవల్లి - 56 మంది

​శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, లోవ - 52 మంది

​శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, వాడపల్లి - 43 మంది

​శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం, మోపిదేవి - 52 మంది

​శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలు - 50 మంది

​శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, పెదకాకాని - 47 మంది

​శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, మాలకొండ - 59 మంది

​శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, పెంచలకోన - 32 మంది

​శ్రీ ఈరన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, ఉరుకుంద - 52 మంది

​శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం, మహానంది - 50 మంది

​శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, ఆర్.ఎస్. రంగాపురం - 58 మంది

​శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం, దిగువపల్లె - 47 మంది

​శ్రీ మత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, కదిరి - 50 మంది

​మొత్తం భక్తుల సంఖ్య: 1,060 మంది

​భక్తులతో పాటుగా రాష్ట్ర సంస్కృతి, కళారూపాలను అక్కడ ప్రదర్శించేందుకు 100 మందితో కూడిన సాంస్కృతిక బృందం (కళాకారులు) కూడా ఈ యాత్రలో పాలుపంచుకుంటున్నారు. రైలు ప్రయాణంలో భక్తులకు భోజనం, వసతి, తాగునీరు, వైద్య సదుపాయాలు నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారుల బృందం వెంట వెళ్తోంది.

ఈ కార్యక్రమంలో దేవాదాయ, సాంస్కృతిక శాఖల అధికారులు, రైల్వే అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada