Vijayawada: అమెరికా, కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు

Vijayawada: విజయవాడలో సీపీఐ రామకృష్ణ మీట్ ది ప్రెస్ నిర్వహించి అమెరికా ఆంక్షలు, మోదీ పాలన మరియు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 8 Sept 2026 8:47 PM IST
Vijayawada
X

Vijayawada: అమెరికా, కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు

విజయవాడ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దురహంకార చర్యలు, ఆంక్షల కారణంగా క్యూబా ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, క్యూబా ప్రజలు లొంగకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అన్నారు. క్యూబా రాజధాని హవానాలో ఇటీవల జరిగిన 24వ అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మిక పార్టీల సమావేశానికి హాజరైన రామకృష్ణతో మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్‌’ కార్యక్రమం నిర్వహించారు.

ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబాను ఎలాగైనా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అమెరికా అనేక ఆంక్షలు విధిస్తోందని రామకృష్ణ ఆరోపించారు. క్యూబాలో విద్యుత్‌, నీరు, రవాణా, మందులు వంటి కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందన్నారు.

ముఖ్యంగా క్యాన్సర్‌ బాధితులు అవసరమైన మందులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్యూబాకు ఇతర దేశాల నుంచి సహాయ సహకారాలు అందకుండా అమెరికా ఆంక్షలు విధించిందని విమర్శించారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సేకరించిన మందులను క్యూబాకు అందజేశామని చెప్పారు. 66 ఏళ్లుగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా పోరాడుతోందని, ఎన్నో కష్టాలు ఎదురైనా అమెరికాకు లొంగకుండా నిలబడటం అభినందనీయమని రామకృష్ణ అన్నారు.

తాజాగా అమెరికా ఆంక్షలను పక్కనపెట్టి రష్యా నుంచి చమురు తరలించేందుకు చర్యలు చేపట్టడం శుభపరిణామమన్నారు. దేశ రాజకీయాలపై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని రామకృష్ణ అన్నారు. 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో నిరుద్యోగ సమస్య, ఇతర ప్రజల దైనందిన సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల నియంత్రణ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన, విదేశాల్లోని నల్లధనం వెనక్కి తీసుకురావడం వంటి హామీలు అమలుకు నోచుకోలేదన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై భారం పడిందని, నిరుద్యోగం పెరగడంతో యువతలో అసంతృప్తి నెలకొందని చెప్పారు. ఇందుకు ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమంలో వెల్లువెత్తిన ప్రజాగ్రహమే నిదర్శనంగా పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని రక్షణ కల్పిస్తోందని రామకృష్ణ ఆరోపించారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికల కమిషన్‌ పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ విలువలు, లౌకికవాదం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ విదేశాల్లో ఒక రకంగా, దేశంలో మరో రకంగా మాట్లాడుతున్నారని రామకృష్ణ విమర్శించారు.

న్యూయార్క్‌లో మత సామరస్యంపై మాట్లాడుతున్న భగవత్‌ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయని, మణిపూర్‌లో రెండున్నరేళ్లుగా హింస కొనసాగుతున్నప్పటికీ చర్చిలు, పాస్టర్లు, మహిళలపై జరుగుతున్న దాడులపై భగవత్‌ స్పందించలేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాలు అభద్రతా భావంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రామకృష్ణ అన్నారు.

చట్టసభల్లో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. దేశంలో మత ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రూపాయి విలువ పతనం, డాలర్‌ విలువ పెరుగుదల, జీడీపీపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు తదితర అంశాలపై కూడా రామకృష్ణ విమర్శలు చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తోందని ఆరోపించారు. ‘సర్‌’ పేరుతో లక్షలాది ఓట్లను తొలగించే చర్యలను ఖండిస్తున్నామని, దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని మత సామరస్య దినంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీపీఐ, ఇతర వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ఐదేళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే అధిగమించిందని అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేంద్రంలో ఉన్న పలుకుబడితో అప్పులు చేయడం మినహా రాష్ట్రానికి అదనంగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని రామకృష్ణ అన్నారు. 300కుపైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలను ప్రకటించలేదని విమర్శించారు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయని, గ్రామాభివృద్ధిని కోరుకునే అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని రామకృష్ణ చెప్పారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఐజేయూ సభ్యుడు షేక్‌ బాబు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story