Vijayawada: విజయవాడలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
Vijayawada: విజయవాడలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు పిలుపు.
Vijayawada: విజయవాడలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
విజయవాడ: తెలంగాణ వీర విప్లవ పోరాటానికి, భూపోరాటాలకు ఐలమ్మ దిశానిర్దేశం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీ నాథ్ కొనియాడారు. వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామాన్య బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చి, ఎలాంటి చదువు లేకపోయినా భూస్వాములు, జమీందార్లు, నైజాం నవాబుల అణచివేతపై ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రజలను సమీకరించి ఆమె సాగించిన పోరాటమే వీర తెలంగాణ విప్లవ పోరాటానికి బలమైన పునాది వేసిందన్నారు. కోట్ల సంపద, పెద్ద పదవులు అనుభవించిన వారిని కాలక్రమేణా జనం మర్చిపోతారని, కానీ ప్రజల కోసం నిలబడిన ఐలమ్మను నేటికీ ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు పేదలు, బలహీన వర్గాల గొంతులను అణిచివేస్తున్నాయని బాబురావు ఆరోపించారు. నాడు పోరాటాల ద్వారా పేదలు సాధించుకున్న భూములను నేటి పాలకులు రకరకాల పేర్లతో గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు సాగుభూమి, నివాస స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా, తెలుగు ప్రజలంతా ఐలమ్మ ఆశయాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.
పేదల భూములను కాపాడుకోవడం, కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతున్న పాలకులపై పోరాడటమే ఐలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. విజయవాడలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆమె త్యాగాలను నిత్యం గుర్తుచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గ కార్యదర్సులు బి. రమణారావు, పి. కృష్ణ,జిల్లా కమిటీ సభ్యుడు కె.దుర్గారావు,విగ్రహ కమిటీ నేతలు కందిగట్ల శ్రీనివాస్,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.




