Vijayawada: వాంబే కాలనీ అండర్ బ్రిడ్జి కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన

Vijayawada: విజయవాడలో వాంబే కాలనీ అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో వర్షంలో ఆందోళన. కూటమి ప్రభుత్వంపై బాబురావు విమర్శలు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 23 Sept 2026 4:14 PM IST
Vijayawada
X

Vijayawada: వాంబే కాలనీ అండర్ బ్రిడ్జి కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన

విజయవాడ: విజయవాడలో బ్రిడ్జిలు, మౌలిక సదుపాయాలను విస్మరించిన కూటమి ప్రభుత్వం, కూటమి ప్రజాప్రతినిధుల మాటలు ఎక్కువ,పని తక్కువ, పదవులలో 100% స్ట్రైక్ రేట్ కాదు.. హామీల అమలులో 100% స్ట్రైక్ రేట్ సాధించండి. వాంబే కాలనీ అండర్ బ్రిడ్జి నిర్మాణం కోరుతూ సిపిఎం ఆందోళన.

ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, తదితర నేతలు. పట్టణ పేదల కొరకు నిర్మించిన వాంబే కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటికీ రైల్వే లైన్ పై నిర్మించాల్సిన అండర్ బ్రిడ్జి వీసమెత్తు ముందుకు సాగలేదు.

ప్రజా ప్రతినిధులు ప్రకటనలే తప్ప ,నిర్దిష్ట చర్యలు లేవు, బ్రిడ్జి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే వాంబే కాలనీ రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ,నిధులు కేటాయించాలని, తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వర్షంలో సైతం కార్యకర్తలు, స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు.

వర్షంలో గొడుగులు చేపట్టి, బ్యానర్లు, ప్లే కార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ......

ముఖ్యమంత్రి, కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రకటనలు చేస్తున్నారు తప్ప, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. వేలకోట్ల రూపాయలతో నగరాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలలో చిత్తశుద్ధి లేదు.

విజయవాడ నగర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. వాంబే కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు గడిచినా, అప్పటినుండి హామీలు ఇస్తున్న పాలకులు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటు. పేదల ఎడల కూటమి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం క్షంతవ్యం కాదు.

వాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, పాయికాపురం తదితర ప్రాంతాల ప్రజలకు అవసరమైన ఈ బ్రిడ్జి నిర్మాణం పై పాలకుల చిన్నచూపు తగదు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడం వలన దాదాపు 5 వేల మంది ప్రజలపై ఒక్కొక్కరికి నెలకు 600 నుండి 1000 రూపాయలు అదనపు భారం రవాణా చార్జీల రూపంలో పడుతుంది.

గత 20 సంవత్సరాల కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయల భారం పడింది. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయటం వలన రైల్వే లైన్ పై అనేకమంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. రైల్వే శాఖ రైల్వే లైన్ దాటుతున్న వారిపై పెనాల్టీలు వేయటమే తప్ప, బ్రిడ్జి నిర్మాణం గురించి పట్టించుకోవటం లేదు.

డబుల్ ఇంజన్ సర్కార్ గా చెప్పుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నా.. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు చేపట్టడం లేదు?

పార్లమెంటు, శాసనసభ్యులు ప్రకటనలతో ప్రజలను మభ్యపరుస్తున్నారు, నిర్దిష్ట చర్యలను చేపట్టడంలో ఘోరంగా విఫలం చెందారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో మేయర్, ఇతర స్థానాల కొరకు ఆరాటపడుతున్న నేతలకు బ్రిడ్జిలు, అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టడం లేదు.

పదవుల కొరకు ఫ్యామిలీ ప్యాకేజీల గురించి ఆలోచిస్తున్న నేతలు, ప్రజలకు ఇచ్చిన హామీల ప్యాకేజీ గురించి శ్రద్ధ పెట్టడం లేదు. పదవుల కోసం ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇస్తున్న నేతలు, బ్రిడ్జిలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారు.

కూటమి ప్రజాప్రతినిధులకు మాటలెక్కువ, పని తక్కువ

సెంట్రల్ నియోజకవర్గంలోనే అజిత్ అజిత్ సింగ్ నగర్ రెండవ ఫ్లై ఓవర్ బ్రిడ్జి, రాజరాజేశ్వరి పేట వద్ద రైల్వే బ్రిడ్జి, మధుర నగర్ బ్రిడ్జి, వాంబే కాలనీ బ్రిడ్జి, గుణదలలో మొండి గోడలతో మిగిలిపోయిన ఫ్లైఓవర్.... ఇలా ఎన్నో బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టలేదు.

అభివృద్ధి గురించి గొప్పలు చెప్పటం ఆపి, బ్రిడ్జిల నిర్మాణం పై దృష్టి పెట్టండి. నేతలకు సొంత సంపాదనపై దృష్టి తప్ప, నగరాభివృద్ధిపై చిత్తశుద్ధి ఏమాత్రం కనపడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది, అమరావతి తో పాటు విజయవాడ ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేయటమే తప్ప నగరాన్ని పట్టించుకోవడం లేదు.

బ్రిడ్జిలు, మౌలిక సదుపాయాలు, నగరాభివృద్ధిని విస్మరించిన కూటమికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ప్రజానీకం చైతన్యంతో బ్రిడ్జి నిర్మాణం,మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్యమించాలి, సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుంది, పోరు సాగిస్తుంది.

నేడు జరిగిన ఈ ఆందోళనలో సిపిఎం నేతలు బి. రమణారావు, ఎస్ కే పీర్ సాహెబ్, సిహెచ్ శ్రీనివాస్, కుమారి, అప్పన్న, రజని, పున్నారావు, రామకృష్ణ, కొండల రావు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.