Vijayawada: శ్రావణ పౌర్ణమి వేడుకలు - అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
Vijayawada: శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Vijayawada: శ్రావణ పౌర్ణమి వేడుకలు - అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
ఇంద్రకీలాద్రి: పవిత్ర శ్రావణ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులతో కొండపై రద్దీ నెలకొంది. శ్రావణ పౌర్ణమి మరియు పవిత్రోత్సవాల సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పుష్పాలు, శోభాయమానమైన విద్యుద్దీపాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
దేవస్థానంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా రెండో రోజు ఆలయ వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలలో హోమాలు, మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు మరియు శాస్త్రోక్త నివేదనలు జరిగాయి.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. కొండపై ఉన్న శివాలయం, ఉపాలయాలను సందర్శించి అక్కడ భక్తులకు కల్పిస్తున్న దర్శన సదుపాయాలు, క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు మంచి నీరు సౌకర్యం, బ్యాటరీ వాహనాల ఏర్పాటు, పార్కింగ్ తదితర విషయాలు స్వయంగా పరిశీలన చేశారు.
ఘాట్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు మరియు కొండ దిగువన దుర్గా ఘాట్ వద్ద భక్తుల స్నానాలు, క్లోక్ రూమ్ సేవలపై ఆరా తీశారు. దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు తాగునీరు, పారిశుద్ధ్యం పర్యవేక్షించాలని మరియు సేవా దృక్పథంతో వ్యవహరించాలని సంబంధిత విభాగాల అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడికి ఆలయ సిబ్బంది ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా అన్నప్రసాదశాలలో భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన, పరిశుభ్రమైన తాజా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఎండ వేడిమి ప్రభావం లేకుండా పందిళ్లు, క్యూ లైన్ల నిర్వహణ పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, ఇంజనీరింగ్, సెక్యూరిటీ అధికారులు మరియు పర్యవేక్షక సిబ్బంది పాల్గొన్నారు.




