Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గగుడికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026’
Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026’ దక్కింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈవో, చైర్మన్ ఈ అవార్డును అందుకున్నారు.
Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గగుడికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026’
Vijayawada: పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో విశేష ప్రమాణాలు పాటిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ఇనిషియేటివ్స్ (SASA)’ లో భాగంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం రాష్ట్ర స్థాయి 'స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026' (Swachha Temples and Religious Institutions) నకు ఎంపికైంది.
శుక్రవారం సాయంత్రం విజయవాడలోని 'ఏ-కన్వెన్షన్ సెంటర్' (A-Convention Center) లో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ ఈ పురస్కారాన్ని రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత (30%), వ్యర్థాల విభజన మరియు సేకరణ (25%), స్వచ్ఛమైన మరియు నిరంతరం పనిచేసే మరుగుదొడ్ల నిర్వహణ (20%), పరిసర ప్రాంతాల పారిశుద్ధ్యం (15%), ప్లాస్టిక్ రహిత విధానాలు మరియు భక్తులలో అవగాహన కల్పించడం (10%) వంటి కీలక ప్రాతిపదికలలో (KPIs) ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను దేవాదాయ శాఖ పరిధిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈ ఘనత సాధించింది.
ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం, దేవాదాయ ఉన్నతాధికారులు అందిస్తున్న మార్గదర్శకత్వంతో పాటు దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిరంతరం చేస్తున్న కృషికే ఈ గుర్తింపు దక్కిందని, ఇదంతా అమ్మవారి అనుగ్రహమని పేర్కొన్నారు.
రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో కూడా పర్యావరణహితంగా, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ భక్తులకు మెరుగైన సేవలందిస్తామని తెలిపారు.




