Vijayawada: కూటమి పాలనలో ప్రజలకు తీరని అన్యాయం - మల్లాది విష్ణు

Vijayawada: విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 8 Oct 2026 8:05 PM IST
Vijayawada
X

Vijayawada: కూటమి పాలనలో ప్రజలకు తీరని అన్యాయం - మల్లాది విష్ణు

విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు, నిత్యావసర సేవలు దూరమయ్యాయని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 66వ డివిజన్, మధుర నగర్ పరిధిలో గురువారం నిర్వహించిన గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, స్థానిక మాజీ కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ప్రజ సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా 1వ డివిజన్, లెనిన్ నగర్ పరిధిలోని రైల్వే గేట్ వరకు దాదాపు 1,000 కుటుంబాలను నేరుగా కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి 2,000 మంది జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇంటి వద్దకే సేవలు అందించారని విష్ణు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు.

ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం కనీసం పర్యవేక్షించడం లేదని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై ఏకంగా రూ.25,000 కోట్ల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఉమ్మడి కుటుంబాల మ్యాపింగ్ నెపంతో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా కోత విధిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమాన్ని నిలిపివేసేందుకే ప్రభుత్వం సాకులు వెతుకుతోందని అన్నారు. పేదల ఇళ్ల పట్టాల రద్దుకు కుట్ర వైఎస్ జగన్ హయాంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 27,000 మందికి, అమరావతి ఆర్5 జోన్‌లో వేలాది మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, పక్కాగా రిజిస్ట్రేషన్ చేశామని విష్ణు తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ జగనన్న కాలనీల పట్టాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఇళ్లు కట్టుకుంటారా లేదా రద్దు చేయమంటారా అని 45 రోజుల గడువు నోటీసులు ఇస్తూ పేదలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా, బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పేదలకు ఆసరాగా ఉండాల్సిన ప్రభుత్వమే వారి పొట్ట కొట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి లెనిన్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూసేకరణ కోసం రూ.22 కోట్లు కేటాయించి జీవో ఇచ్చామని, ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో నిత్యం విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. అమృత్ స్కీమ్ కింద మంజూరైన మంచినీటి పథకం పనులను వేగవంతం చేసి ప్రజలకు మంచినీరు అందించాలన్నారు. నగరంలో చెత్త కుప్పలు పెరిగిపోయి పారిశుధ్యం పూర్తిగా మృగ్యమైందని, నగరపాలక సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*మంత్రి రాజీనామా డిమాండ్*నంద్యాల మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దారుణ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. రాబోయే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌సీపీ పూర్తి సిద్ధంగా ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఫ్యాన్ గుర్తు అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జానా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కొండా మహేష్ రెడ్డి , ఆళ్ల ప్రసాద్ రెడ్డి, దొంతిబోయిన దుర్గారావు, భోగాది మురళి , అబ్బాస్, కొత్తపల్లి రజిని, మాతా మహేష్, సువ్వాడ మనోహర్, కొలకలేటి రమణి, గుడిసె శ్యామ్ రఫీ, మేడా రమేష్, మాన్యం జగదీష్, వెన్నం రత్నారావు ,తోపులు వరలక్ష్మి, త్రివేణి రెడ్డి, సిరి శెట్టి రాజా , మేడేపల్లి ఝాన్సీ, శివకుమారి, లక్ష్మణరావు, పేరూరి ప్రేమ్ కుమార్, కంచర్ల సాంబ, నగర ప్రసాద్, ఏపూరి మనోహర్, సామంతకూరి దుర్గారావు, మజ్జి కుమార్, లక్ష్మి, పార్వతి, భాస్కర్, దాసరి చిన్నారావు, కుంభ రవి వర్మ, బోనం నాగు, ఎర్రి బోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.