Vijayawada: ఘనంగా విజయవాడ ఉత్సవ్-2.0 నిర్వహణ
Vijayawada: విజయవాడ ఉత్సవ్-2.0 ఏర్పాట్లపై ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, గొట్టిముక్కల రఘు మీడియా సమావేశం. 5 వేల మంది కళాకారులతో కార్నివాల్.
Vijayawada: ఘనంగా విజయవాడ ఉత్సవ్-2.0 నిర్వహణ
విజయవాడ: విజయవాడ (ఎంపీ కార్యాలయం )విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛతా మారథాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర ఉద్యమం ముందుకు సాగుతోందన్నారు. 22 రాష్ట్రాల నుంచి 10 వేల మందికి పైగా మారథాన్‌లో పాల్గొనడం అభినందనీయమని, విజయవాడ ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
స్వచ్ఛతా మారథాన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారని చెప్పారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుందని పేర్కొన్నారు.ఇదే స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్–2.0ను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పట్టాభిరామ్ తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలు సమిష్టిగా పనిచేస్తున్నారని చెప్పారు. విజయవాడ ఉత్సవ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు ఎంపీ చిన్ని ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌కు లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని పట్టాభిరామ్ చెప్పారు. అనేక మంది వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉత్సవ నిర్వహణకు సహకరిస్తున్నారని తెలిపారు.గత ఏడాది కంటే ఈసారి మరింత వైవిధ్యంగా, ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చే అతిథులు, ప్రజలు విజయవాడ దసరా వైభవం, విజయవాడ ఉత్సవ్ గురించి గొప్పగా చెప్పుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు.
గత ఏడాది 3 వేల మంది కళాకారులతో నిర్వహించిన కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఈసారి 5 వేల మంది కళాకారులతో భారీ కార్నివాల్ నిర్వహించనున్నామని తెలిపారు. పున్నమిఘాట్, ఎం.బి.కె. స్టేడియం, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల తదితర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సరస్సు మేళా, డ్రోన్ షోలు, క్రాకర్ షోలు, లేజర్ షోలు వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.తుమ్మలపల్లి కళాక్షేత్రంలో యువత, చిన్నారులు, పెద్దలను భాగస్వాములను చేస్తూ వివిధ పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టిముక్కల రఘు మాట్లాడుతూ గత ఏడాది విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా జరిగిందని, ఈ ఏడాది అంతకంటే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.విజయవాడతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఉత్సవ్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
చిన్నారుల నుంచి పెద్దల వరకు వివిధ పోటీలు నిర్వహించడంతో పాటు, ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతను చాటిచెప్పేలా పెద్ద కుటుంబాలను వేదికపై సత్కరించి స్ఫూర్తిని అందించే కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు రఘు తెలిపారు.స్వచ్ఛతా మారథాన్‌ను విజయవంతం చేసిన ప్రజల భాగస్వామ్యంతోనే విజయవాడ ఉత్సవ్–2.0ను కూడా మరింత విజయవంతం చేయాలని పట్టాభిరామ్, రఘు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పట్టాభి గొట్టుముక్కల రఘురామరాజు,గుమ్మడి గోపాల కృష్ణా పాల్గొన్నారు




