Vijayawada: నేపాల్‌లో 5 స్వర్ణాలతో మెరిసిన విజయవాడ చిన్నారి చెరుకూరి ఆరోహి!
Vijayawada: నేపాల్‌లో జరిగిన ఇండో-నేపాల్ చాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన చెరుకూరి ఆరోహి అండర్-14 విభాగంలో 5 బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయంగా సత్తా చాటింది.
Vijayawada: నేపాల్‌లో 5 స్వర్ణాలతో మెరిసిన విజయవాడ చిన్నారి చెరుకూరి ఆరోహి!
విజయవాడ: తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది విజయవాడకు చెందిన చిన్నారి చెరుకూరి ఆరోహి. డాక్టర్ Ch. లీలా కృష్ణ ప్రసాద్ కుమార్తెగా తండ్రికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంటూ, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత కీర్తిని చాటుతోంది.
నేపాల్‌లోని పోఖారా వేదికగా ఆగస్టు 19 నుంచి 21 వరకు జరిగిన 2026–27 ఇండో–నేపాల్ ఛాంపియన్‌షిప్లో అండర్–14 ఏరో స్టేట్ బాల్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న ఆరోహి అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించింది.
విజయవాడలోని రవీంద్ర భారతి Nextgen తులసి నగర్ బ్రాంచ్‌లో VI చదువుతున్న ఆరోహి.. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతూ దేశానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఐదు విభాగాలు.. ఐదు స్వర్ణాలు
పోటీల్లో ఆరోహి స్పీడ్ రేస్, జిగ్‌జాగ్, హర్డిల్స్, స్టేట్ వక్ట్, టీమ్ గేమ్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి ఐదు బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
చిన్న వయసులోనే ఒకే అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా ఆరోహి తన ప్రతిభకు పదును పెట్టింది. భారత జెండాను అంతర్జాతీయ క్రీడా వేదికపై రెపరెపలాడిస్తూ విజయవాడ పేరును మారుమోగించింది.
తండ్రి ప్రోత్సాహం.. కూతురి ప్రతిభ
ఆరోహి విజయానికి ఆమె సహజ ప్రతిభతో పాటు కుటుంబ ప్రోత్సాహం, క్రమశిక్షణ, నిరంతర సాధన ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా తండ్రి డాక్టర్ Ch. లీలా కృష్ణ ప్రసాద్ అందించిన ప్రోత్సాహం, ప్రేరణ ఆరోహిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్కొంటున్నారు.
తండ్రి సాధించిన గుర్తింపును గౌరవిస్తూ.. తన ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న ఆరోహి నిజంగా “తండ్రికి తగ్గ కూతురు” అనిపించుకుంటోంది. తండ్రి ప్రోత్సాహానికి తన క్రీడా ప్రతిభను జోడించి అంతర్జాతీయ వేదికపై ఐదు స్వర్ణాలు సాధించడం ప్రశంసనీయం.
కోచ్ శిక్షణ.. విజయానికి మరో బలం
ఆరోహి విజయానికి బిగ్ ఛాంపియన్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ భాషా అందించిన ప్రత్యేక శిక్షణ కూడా కీలకంగా నిలిచింది. అంతర్జాతీయ పోటీలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం శిక్షణ అందిస్తూ ఆరోహిని పోటీలకు సన్నద్ధం చేశారు. కోచ్ మార్గదర్శకత్వం, ఆరోహి కఠోర సాధన కలిసి ఈ విజయాన్ని సాధించేందుకు దోహదపడ్డాయి.
అభినందనల వెల్లువ
ఆరోహి సాధించిన ఘనతపై రవీంద్ర భారతి Nextgen తులసి నగర్ బ్రాంచ్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, స్నేహితులు, బంధుమిత్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
చిన్న వయసులోనే ఐదు స్వర్ణ పతకాలు సాధించిన ఆరోహి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని, భారతదేశానికి మరిన్ని పతకాలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.
తండ్రి గర్వపడేలా.. దేశం గర్వించేలా..
తండ్రికి తగ్గ కూతురిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన చెరుకూరి ఆరోహికి హృదయపూర్వక అభినందనలు.




