Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద వ్యవస్థ ఆధునీకరణపై ఈవో సమీక్ష!
Indrakeeladri: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాదం తయారీ, పంపిణీ ఆధునీకరణపై హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ఈవో శీనా నాయక్ సమీక్ష నిర్వహించి నివేదిక కోరారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అన్నప్రసాద వ్యవస్థ ఆధునీకరణపై ఈవో సమీక్ష!
ఇంద్రకీలాద్రి, 05 నవంబర్ 2026: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు నిరంతరం అందించే శ్రీ అమ్మవారి పవిత్ర అన్నప్రసాదం నాణ్యత, తయారీ విధానం మరియు పంపిణీ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే దిశగా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేవస్థానం ఇప్పటికే నియమించిన ప్రత్యేక కమిటీ అభిప్రాయములు పై గురువారం ఉదయం ఈవో ఛాంబర్లో కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో హరే కృష్ణ ఫౌండేషన్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) శ్రీ హరితో పాటు దేవస్థాన అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం విభాగాల అధికారులు శ్రీమతి సుధారాణి, చంద్రశేఖర్,ఏఈవో రమేష్ బాబు,ఇఇ రమాదేవి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ సిహెచ్ రంగారావు పాల్గొన్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ తమ 'అక్షయ పాత్ర' విభాగం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మందికి అత్యంత పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరాయంగా అందిస్తూ విశేష సేవలందిస్తున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా ప్రముఖంగా చర్చించారు.
అదే తరహాలో ఇంద్రకీలాద్రిపై నిత్యం తరలివచ్చే వేలాది మంది భక్తులకు స్వచ్ఛమైన, రుచికరమైన వేడి అన్నప్రసాదాన్ని వేగవంతంగా అందించేందుకు అధునాతన యంత్రాల వినియోగం, వంటశాల ఆధునీకరణ మరియు పంపిణీ వ్యవస్థల నిర్వహణపై సమగ్ర కార్యాచరణను రూపొందించారు.
ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ.. భక్తులకు అన్నప్రసాద వితరణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు అనుసరించి ప్రసాద తయారీలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, వంటశాల పరిశుభ్రత, మరియు రద్దీ సమయాల్లో క్యూలైన్లలోని భక్తులకు సైతం సత్వరమే వేడి అన్నప్రసాదం అందేలా నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని, ప్రస్తుతం భోజనం తయారీకి అవుతున్న ఖర్చు, ఆధునిక వంట శాలలో భోజనం తయారుకు అవుతున్న ఖర్చు బేరీజు వేసి నివేదిక పంపాలని స్పష్టం చేశారు.




