Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస పూజలు, భవానీ దీక్షలపై సమీక్ష!
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస పూజలు, నవంబర్ 11న గాజుల అలంకారోత్సవం, భవానీ దీక్షల ఏర్పాట్లపై ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస పూజలు, భవానీ దీక్షలపై సమీక్ష!
ఇంద్రకీలాద్రి, 05 నవంబర్ 2026: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రానున్న కార్తీక మాస ప్రత్యేక పూజలు, భగినీ హస్తభోజనం సందర్భంగా శ్రీ అమ్మవారి గాజుల అలంకారోత్సవం, మరియు వార్షిక శ్రీ భవానీ దీక్ష ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై గురువారం సాయంత్రం పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానాచార్య శ్రీ శివ ప్రసాద్ శర్మ,వైదిక కమిటీ సభ్యులు శ్రీ శంకర శాండిల్య , డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్,అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఇఇ రమాదేవి,ఏఈవోలు చంద్ర శేఖర్, సుధారాణి, రమేష్ బాబు, గంగాధర్, తిరుమలేశ్వరరావు, లక్ష్మి ప్రసన్న మరియు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ.. నవంబర్ 10 నుండి ప్రారంభం కానున్న కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయంలో జరిగే ఆకాశదీపం, నిత్య అభిషేకాలు, బిల్వార్చనలు, కార్తీక పౌర్ణమి నాటి కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నవంబర్ 11న భగినీ హస్తభోజనం పర్వదినాన శ్రీ కనకదుర్గ అమ్మవారికి నిర్వహించే విశేష గాజుల అలంకారోత్సవ దర్శనానికి విచ్చేసే భక్తులకు క్యూలైన్లలో సౌకర్యాలు, ప్రసాద వితరణలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం నవంబర్ 20 నుండి ప్రారంభం కానున్న భవానీ దీక్షాధారణలు, డిసెంబర్ 24న జరిగే కలశజ్యోతి మహోత్సవం, డిసెంబర్ 30 నుండి జనవరి 03 వరకు జరిగే దీక్షా విరమణల ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రం నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలివచ్చే భవానీ భక్తులకు కేశఖండనశాలలు, స్నానఘట్టాలు, తాగునీరు, నిరంతర అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం నిల్వలు మరియు హోమగుండాల వద్ద భద్రతా చర్యలను ఇంజినీరింగ్, భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకుని ముందస్తుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రానికి వచ్చే భక్తులెవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి బాధ్యతతో పనిచేయాలని ఈవో ఆదేశించారు.




