Vijayawada: ఆటోలో మరిచిపోయిన 2 తులాల బంగారం స్వాధీనం.. బాధితురాలికి అందజేత
Vijayawada: ఆటోలో ప్రయాణిస్తూ మర్చిపోయిన 2 తులాల బంగారాన్ని చాకచక్యంగా స్వాధీనం చేసుకున్న కంకిపాడు ఎస్ఐ దాస్. బాధితురాలికి ఆభరణాలు అప్పగింత, పోలీసులకు ప్రశంసలు.
Vijayawada: ఆటోలో మరిచిపోయిన 2 తులాల బంగారం స్వాధీనం.. బాధితురాలికి అందజేత
విజయవాడ: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మరిచిపోయిన రెండు తులాల బంగారు ఆభరణాలను పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితురాలికి తిరిగి అందజేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ దాస్‌ను బాధితురాలు అభినందించారు.
వివరాల్లోకి వెళితే.. అద్దంకి భాగ్యలక్ష్మి (భర్త గణేష్) నవంబర్ 6వ తేదీన దుర్గమ్మ తల్లి దర్శనం అనంతరం ఈడుపుగల్లు గ్రామంలోని తన అత్తగారింటికి వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు గోశాల సెంటర్ వద్ద ఆటో ఎక్కారు. ఈ క్రమంలో తన బ్యాగులో ఒక తులం బంగారు గాజులు, ఒక తులం బంగారు మాల, రెండు మురుగులు భద్రపరిచారు.
విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో దిగే సమయంలో బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆభరణాలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భాగ్యలక్ష్మి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన కంకిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ దాస్ విచారణ చేపట్టి, సంబంధిత ఆటో డ్రైవర్ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని బాధితురాలికి సురక్షితంగా తిరిగి అప్పగించారు.
తన విలువైన ఆభరణాలను తిరిగి అందించిన పోలీసులకు భాగ్యలక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతాయుతంగా స్పందించి ప్రజలకు సేవలందించిన పోలీసుల తీరుపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.




