Vijayawada: కూటమి పాలనలో మౌలిక వసతులు శూన్యం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు!
Vijayawada: సత్యనారాయణపురంలో గడప గడపకు వెళ్లిన మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, బ్రాహ్మణుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శలు.
Vijayawada: కూటమి పాలనలో మౌలిక వసతులు శూన్యం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు!
Vijayawada: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురంలో మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ‘గడప గడపకు’ వెళ్ళి ప్రజల సమస్యలను ఆరా తీశారు. స్థానికులకు ఓటర్ ఐడీ కార్డులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో ఎంతో ఆప్యాయంగా గడిపారు.
పర్యటన నిమిత్తం వీధుల్లో తిరుగుతూ, స్థానిక టీ కొట్టు వద్ద ఆగి ప్రజలతో కలిసి సరదాగా టీ తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సత్యనారాయణపురంలోనే రూ. కోట్లతో 17 సిమెంట్ రోడ్లు వేశామని మల్లాది విష్ణు గుర్తుచేశారు. వర్షం వస్తే మునిగిపోయే ఈ ప్రాంతంలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి, రోడ్లు జలమయం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించామన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో 33వ డివిజన్‌లో 1,200 మందికి, సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని తెలిపారు. అలాగే సెంటు స్థలంలో నిర్మించిన 5,000 ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవన్నీ పక్కన పడేసిందని విమర్శించారు.
చెత్త డివిజన్‌గా మార్చిన కూటమి నాయకులు
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రోడ్లన్నీ నాశనమయ్యాయని, శానిటేషన్ పూర్తిగా అధ్వానంగా తయారైందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతోందని, కూటమి నాయకులు సత్యనారాయణపురాన్ని ఒక చెత్త డివిజన్‌గా మార్చేశారని మండిపడ్డారు. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నగరపాలక సంస్థ, కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుకే తప్ప ప్రజలకు రూపాయి ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇంకా బుద్ధి రాలేదని, వారిలో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ముందు నగరాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లు మున్సిపల్ ఆఫీస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు నిరసనలు తెలిపినా పెండింగ్ బిల్లులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ స్థలాలను తాకట్టు పెట్టి అభివృద్ధి చేయాలంటూ చంద్రబాబు కొత్త జీవోలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓటేస్తే ఆ ఓటు నిర్వీర్యమవుతుందని హెచ్చరించారు.
బ్రాహ్మణుల పట్ల నైచ్యం.. పథకాల రద్దు
వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీలో నోటిఫికేషన్ ద్వారా 700 వేద పారాయణ ఉద్యోగాలు విడుదల చేశామని విష్ణు తెలిపారు. అయితే సత్యనారాయణపురానికి చెందిన వేద పండితులు సర్టిఫికేట్ల కోసం ఎంఆర్వో ఆఫీస్‌కు వెళ్తే తీవ్ర నిరాదరణకు గురవుతున్నారని అన్నారు. విజయవాడ ఎంఆర్వో ఆఫీస్‌లో అన్నింటికీ కలిపి ఒకే సర్టిఫికెట్ ఇస్తుండటంతో దానిని టీటీడీ అంగీకరించడం లేదని, బ్రాహ్మణ సామాజిక వర్గం సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గరుడ స్కీమ్ ప్రవేశపెట్టి, ఎవరైనా చనిపోతే రూ.10,000 ఆర్థిక సహాయం అందించామని, కూటమి ప్రభుత్వం రాగానే ఆ పథకాన్ని ఎత్తివేశారని విమర్శించారు. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా వెనుకబడిన అగ్రకులాలకు చేయూతనిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
రెండు సంవత్సరాల పాలనలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి ప్రజలను దారుణంగా మోసం చేశారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు నిలదీసి ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దోనేపూడి శ్రీనివాస్, మారుతి, సనత్, చందు శర్మ, ములుకుట్లు మూర్తి, రాజశేఖర్, కమ్మిలి రత్న, లంక బాబు, కృష్ణ, పెద్దిబొట్ల కనకదుర్గ, స్వర్ణలత, కనగర్ల ఫణి, బండారు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.




