Vijayawada: భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. క్యూలైన్లలో భక్తులతో మాట్లాడి, వృద్ధులు, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 16 Oct 2026 5:29 PM IST
Vijayawada
X

Vijayawada: భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని!

విజయవాడ: (ఇంద్రకీలాద్రి)విజయవాడ ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ కేశినేనికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఎంపీ కేశినేని చిన్ని స్వయంగా పరిశీలించారు. క్యూ లైన్లలో వెళ్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శనానికి ఎంత సమయం పడుతోంది, భక్తులకు అవసరమైన సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు అందించాలని సూచించారు.

క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు అందుబాటులో ఉండేలా పరిశీలించడంతో పాటు, చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వారికి స్వయంగా వేడి పాలు అందించి ఆప్యాయతను చాటుకున్నారు. భక్తుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తుచేశారు.

భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. అక్కడ భక్తులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు తక్షణ వైద్య సహాయం అందేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని, క్యూ లైన్ల నిర్వహణలో సమన్వయంతో వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.

వేద విద్య అభ్యసిస్తున్న చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చట

ఈ సందర్భంగా వేద పాఠ్యాంశాలను అభ్యసిస్తున్న చిన్నారులతో ఎంపీ కేశినేని చిన్ని సరదాగా ముచ్చటించారు. వారు నేర్చుకుంటున్న వేద విద్య, అధ్యయన వివరాలను అడిగి తెలుసుకుని, చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఆలయంలో అందుతున్న సేవలు, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను ఎంపీ కేశినేని చిన్ని స్వయంగా పరిశీలించడం విశేషం.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.