Vijayawada: విజయవాడ ఉత్సవ్‌ను ‘మన ఉత్సవ్’గా విజయవంతం చేయాలి ఎంపీ చిన్ని
Vijayawada: విజయవాడ ఉత్సవ్‌ను ప్రతి ఒక్కరూ మన ఉత్సవ్‌గా భావించి విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Vijayawada: విజయవాడ ఉత్సవ్‌ను ‘మన ఉత్సవ్’గా విజయవంతం చేయాలి ఎంపీ చిన్ని
విజయవాడ: విజయవాడ ఎంపీ కార్యాలయంలో వివిధ బీసీ సంఘాల నాయకులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సమావేశమయ్యారు. విజయవాడలో జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0ను విజయవంతంగా నిర్వహించేందుకు బీసీ సంఘాల సహకారం, భాగస్వామ్యంపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ కేవలం ఒక కార్యక్రమం కాదని, విజయవాడ ప్రజలందరి పండుగ అని అన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ ‘ఇది మన ఉత్సవ్’ అనే భావనతో ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విజయవాడకు ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. మైసూరు దసరా ఉత్సవాలకు దీటుగా, మరింత వైభవంగా విజయవాడ ఉత్సవాలను నిర్వహించే దిశగా అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు.
విజయవాడ నగరంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, వివిధ వృత్తి, సామాజిక సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఉత్సవాల్లో భాగస్వాములై తమవంతు సహకారం అందించాలని ఎంపీ కోరారు. ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసి, నగరానికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి ఎం.వి. రావు, నమ్మి అప్పారావు యాదవ్, మేక వెంకటేశ్వరరావు తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.




