Vijayawada: మేరిస్ స్టెల్లా కాలేజీలో ఎంపీ కేశినేని చిన్ని ముఖాముఖి!

Vijayawada: మేరిస్ స్టెల్లా కాలేజీలో ‘యువత భవితకు భరోసా’: విద్యార్థినులతో ఎంపీ కేశినేని చిన్ని ముఖాముఖి. DSC, APPSC పారదర్శక నియామకాలపై విద్యార్థినులకు స్పష్టమైన హామీ.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 22 Sept 2026 11:32 PM IST
Vijayawada
X

Vijayawada: మేరిస్ స్టెల్లా కాలేజీలో ఎంపీ కేశినేని చిన్ని ముఖాముఖి!

విజయవాడ: విజయవాడ(స్టెల్లా కాలేజీ)మేరిస్ స్టెల్లా కళాశాల విద్యార్థినులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ‘యువత భవితకు భరోసా’ పేరుతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో విద్య, ఉపాధి, మహిళా సాధికారత, రాజకీయాలు, సామాజిక అంశాలు, విజయవాడ అభివృద్ధి తదితర అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. నేటి యువత కేవలం విద్యకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు, మహిళలకు కల్పిస్తున్న అవకాశాలు, రిజర్వేషన్లు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం సంతోషకరమన్నారు. మేరిస్ స్టెల్లా విద్యార్థినులు సమాజం, రాజకీయాలు, మహిళా రిజర్వేషన్లపై ప్రదర్శించిన చైతన్యం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

యువతకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు పారదర్శకమైన నియామక ప్రక్రియ ద్వారా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. DSC, APPSC వంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని యువతకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మార్గదర్శకత్వం, అవకాశాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించినప్పుడే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చిన్ని పేర్కొన్నారు.ఈ సందర్బంగా విద్యార్థులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువతులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.విజయవాడ నగర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.

యువత ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడను ప్రగతి పథంలో నడిపించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు పలు ప్రశ్నలు అడిగి తమ అభిప్రాయాలను ఎంపీ చిన్ని దృష్టికి తీసుకువచ్చారు. యువతకు సంబంధించిన అంశాలపై విద్యార్థినులతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమం ఆలోచనలను పంచుకునే వేదికగా నిలిచింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.