Vijayawada: ఓటర్ల జాబితా ప్రత్యేక క్యాంపెయిన్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర
Vijayawada: ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునేందుకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ తెలిపారు.
Vijayawada: ఓటర్ల జాబితా ప్రత్యేక క్యాంపెయిన్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 29, 30 తేదీల్లో అనగా శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహించామని, ఓటర్లకు మరింత అవకాశం కల్పించేందుకు తిరిగి ఈ నెల 29, 30 తేదీల్లో కూడా ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రజలు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పేరు ఉన్న వారు తమ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో తదితర వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అదేవిధంగా ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోయినా అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవచ్చని తెలిపారు.
కాబట్టి ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటర్ జాబితాలో పేరు లేకపోయినా లేదా తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా వాటిని సరిచేసుకునేందుకు, అవసరమైన మార్పులు చేసుకునేందుకు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు తగిన అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపెయిన్ డేస్‌లో పాల్గొని తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు లేదా కొత్తగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఓటర్ జాబితా సంబంధిత సందేహాలు, సహాయం అవసరమైన పక్షంలో ఎన్టీఆర్ జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 9154970454ను సంప్రదించాలని సూచించారు.




