Vijayawada: కృష్ణలంకలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (C4) ప్రారంభం
Vijayawada: విజయవాడ కృష్ణలంకలో ఎన్టీఆర్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. త్వరలో ప్రతి జిల్లాకు ప్రత్యేక టీమ్స్.
Vijayawada: కృష్ణలంకలో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (C4) ప్రారంభం
విజయవాడ: ప్రజల సైబర్ భద్రత కోసం, ఆధునిక సాంకేతికతతో, ప్రత్యేక నైపుణ్యాలతో సైబర్ నేరాలపై సమర్థవంతమైన పోరాటానికి గౌరవ రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఎ.పి. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ వారి సహకారంతో ఎన్.టి.ఆర్. పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి సూచనలతో సైబర్ క్రైమ్ డి.సి.పి. శ్రీమతి కె.కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఎ.సి.పి. శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు వారి సిబ్బందితో కలిసి కృష్ణ లంక పోలీస్ స్టేషన్లోని 3వ అంతస్తు నందు కార్పొరేట్ స్థాయిలో ఈ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ C4 ను అత్యంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఈ రోజు గౌరవ రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.గారు ముఖ్య అతిధిగా హాజరై కృష్ణ లంక పోలీస్ స్టేషన్లోని 3వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన ఎన్.టీ.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ C4 ను అత్యంత ఘనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ... రాష్ట్రంలో డ్రగ్స్ మాదిరిగానే సైబర్ కేసులు తీవ్రంగా ఉన్నాయి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో ఇప్పటికే డ్రగ్స్ ను నియంత్రణలోనికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సైబర్ కేసులు నియంత్రించడానికి సైబర్ గార్డ్ పాలసీ తీసుకురావడం జరుగుతుంది, ఏపీలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఇటువంటి సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ లను ఏర్పాటు చేసి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. ప్రతి జిల్లాకు 20 మంది సైబర్ కానిస్టేబుల్స్ ను నియమిస్తున్నాం, సైబర్ నేరాల్లో నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం అనేది కీలకం, ఆ సమయంలో నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్: 1930 కు తక్షణమే కాల్ చేసి నమోదు చేయండి. లేదా www.cybercrime.gov.in లో నేరుగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు మాట్లాడుతూ....... ప్రజల డిజిటల్ భద్రత కోసం మరియు బాధితుడి ఫిర్యాదు నుంచి నేరస్థుడి ఆనవాళ్ల వరకు ప్రతి సమాచారాన్ని విశ్లేషిస్తూ, ప్రతి ఆధారాన్ని అనుసరిస్తూ సైబర్ నేరాలు జరుగకుండా మరియు జరిగిన సైబర్ నేరాలలో బాధితుడికి న్యాయం అందించడమే ఈ యొక్క సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (C4 సెంటర్) యొక్క ప్రధాన లక్ష్యం అని, అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఒక సైబర్ ఎస్‌ఐని నియమించి వారి ద్వారా సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఫిర్యాదులను దర్యాప్తు చేయడంతో పాటు, ప్రజల వద్దకే వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సైబర్ భద్రతను ప్రజలకు మరింత చేరువ చేయడం జరుగుతుంది.
ఈ సైబర్ ఎస్‌ఐలు మరియు సైబర్ క్రైమ్ సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు పద్ధతులపై శిక్షణ అందించడం జరుగుతుంది. అవగాహనే సైబర్ నేరాలపై మొదటి రక్షణ కవచం అనే లక్ష్యంతో 'ఖాకీ బాబు', 'సైబర్ చిట్టి' వంటి వినూత్న పాత్రలతో వీడియోలు రూపొందించి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ద్వారా ప్రచారం చేయడం, ప్రచార రథాల ద్వారా, డ్రోన్‌ల ద్వారా ఆడియో సందేశాలు వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డి.జి.పి. శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. గారితోపాటు, ఎ.పి. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం.రవి ప్రకాష్ ఐ.పి.ఎస్ గారు, పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు , డి.సి.పి.లు శ్రీ కృష్ణ కాంత్ పటేల్ ఐ.పి.ఎస్ గారు, శ్రీ కె.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్.గారు, శ్రీమతి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., గారు, శ్రీ ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., గారు, శ్రీమతి కె.కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్.గారు, శ్రీ బి లక్ష్మీనారాయణ ఐ.పి.ఎస్.గారు శ్రీ జి.రామకృష్ణ గారు, శ్రీ బి.సత్యనారాయణ గారు, ఎ.డి.సి.పి.లు, ఎ.సి.పి.లు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




