Vijayawada: పున్నమిఘాట్‌లో ఘనంగా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ ప్రారంభం!

Vijayawada: కృష్ణా తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 వైభవంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Oct 2026 11:47 PM IST
Vijayawada
X

Vijayawada: పున్నమిఘాట్‌లో ఘనంగా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ ప్రారంభం!

విజయవాడ: విజయవాడ(పున్నమి ఘాట్)పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ నదీ తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 అట్టహాసంగా ప్రారంభమైంది. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవతో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

పున్నమి ఘాట్‌లో కళాకారులు ప్రదర్శించిన విభిన్న కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, మరుగున పడుతున్న సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, దూండి రాకేష్ బేగ్, తేజస్వి, గద్దె అనురాధ, సామినేని ఉదయభాను, బుద్ధా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. గత ఏడాది విజయవాడ ఉత్సవ్ తొలి సీజన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించగా, రెండో సీజన్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడమే ఉత్సవ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను అవార్డుగా భావిస్తున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు ఎంపీ కేశినేని చిన్ని చేసిన కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో ఈ వేడుకలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి చేరుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ దసరా ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మైసూరు ఉత్సవాల తరహాలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయని అన్నారు. ఈ వేడుకలకు విజయవాడ ప్రజలే అసలైన బ్రాండ్ అంబాసిడర్లని, స్థానిక కళాకారులు, యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని చెప్పారు.

దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు విజయవాడ ఉత్సవ్‌ను సందర్శించే ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతి కలగడంతోపాటు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులతో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా ఈ ఉత్సవాలకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాల తరహాలో విజయవాడ ఉత్సవ్‌ను కూడా అత్యంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ సంస్కృతి, వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందించిన ఎంపీ కేశినేని చిన్ని కృషిని అభినందించారు. మహిళల భద్రత, గౌరవం, సాధికారతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

విజయవాడను సాంస్కృతికంగా, పర్యాటకంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందేలా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో ప్రజలందరూ భాగస్వాములై ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.