Vijayawada: విజయవాడ ఉత్సవ్ సీజన్-2 ముగింపు: సీఎం చంద్రబాబు
Vijayawada: విజయవాడ ఉత్సవ్ సీజన్-2 ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎంపీ కేశినేని చిన్నిని అభినందించారు.
Vijayawada: విజయవాడ ఉత్సవ్ సీజన్-2 ముగింపు: సీఎం చంద్రబాబు
విజయవాడ: (చుట్టగుంట) విజయవాడ ఉత్సవ్ సీజన్–2 ముగింపు వేడుకలు నగరంలో అంబరాన్నంటాయి. గత పది రోజులుగా కృష్ణానది తీరాన నిర్వహించిన విజయవాడ ఉత్సవ్‌కు ముగింపు పలుకుతూ నిర్వహించిన మెగా కార్నివాల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మెగా కార్నివాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వర్ల రామయ్య, రఘు, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ ఉత్సవ్‌ను దేశవ్యాప్తంగా చర్చించుకునేలా నిర్వహించారు: సీఎం చంద్రబాబు
విజయవాడ ఉత్సవ్ సీజన్–2ను విజయవంతంగా నిర్వహించిన ఎంపీ కేశినేని చిన్నితో పాటు నిర్వాహకులందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుపేరునా అభినందించారు. గత ఏడాది అందరి ప్రశంసలు అందుకునేలా ఉత్సవాలను నిర్వహించగా, ఈ ఏడాది దేశం మొత్తం చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఈ విజయానికి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
రాష్ట్ర కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతోపాటు చేతివృత్తుల కళాకారులకు అవకాశాలు కల్పించే గొప్ప వేదికగా విజయవాడ ఉత్సవ్ నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా కలగలిసి ప్రజలకు సరికొత్త పండుగ వాతావరణాన్ని అందించాయని చెప్పారు. ఈ వేడుకలతో విజయవాడ నగరానికి ప్రత్యేక శోభ వచ్చిందని పేర్కొన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం అన్నారు. కళలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి ఎప్పటికప్పుడు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో ఆనందాన్ని నింపడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.
టెక్నాలజీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆధ్యాత్మికత అవసరమని, ప్రపంచాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమైతే, ఆధ్యాత్మికత ద్వారా మన మనసులను మనం జయించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దసరా ఉత్సవాలకు రెండు లక్షల మంది భక్తులు అదనంగా వచ్చారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లోనూ ఇలాంటి ఉత్సవాలను నిర్వహించి కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రోత్సహించాలని సూచించారు.
విజయవాడకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతి కూడా రావడం నగర విశిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది విజయవాడ ప్రభావమని, ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతగా భావిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా పండుగలు జరుపుకునే వాతావరణం నెలకొందని, ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని సీఎం తెలిపారు. సుపరిపాలనతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో కరువును జయించే శక్తిని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించే ఆశీస్సులను కనకదుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరికీ ఆర్థికంగా మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు.
విజయవాడలో వేలాది మంది ప్రజల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్న ముఖ్యమంత్రి, దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ ఉత్సవ్ సీజన్–2 కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మారుమోగేలా నిర్వహించారని ప్రశంసిస్తూ, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
సీఎం సహకారం, సూచనలతోనే విజయవాడ ఉత్సవ్ విజయవంతం: ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని
విజయవాడ ఉత్సవ్ సీజన్–2 విజయవంతం కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సహకారం, మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు.
ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, గత పది రోజులుగా కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అన్ని విధాలా సహకరించారని పేర్కొన్నారు. విజయవాడ ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్సవాలను నిర్వహించాలని సీఎం ఇచ్చిన సూచనలను పాటిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ కేవలం ఒక వేడుకగా కాకుండా, ప్రజలందరూ భాగస్వాములయ్యే సాంస్కృతిక వేదికగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారని ఎంపీ వివరించారు. కళాకారులను ప్రోత్సహించడం, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించడం, ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం లక్ష్యంగా పది రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు 9,500 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించి, అనేక అంశాల్లో పోటీలు నిర్వహించామని కేశినేని చిన్ని వెల్లడించారు. విజయవాడ నగరానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు, సాంస్కృతిక సంస్థలు, నిర్వాహకులు సమష్టిగా కృషి చేసి ఉత్సవాలను దిగ్విజయం చేశారని తెలిపారు.
విజయవాడ ఉత్సవ్‌ను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తలను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారని ఎంపీ గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన ప్రోత్సాహం, సూచనలతోనే ఈసారి విజయవాడ ఉత్సవ్ సీజన్–2ను విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.
నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ ఉత్సవ్ గురించి చర్చించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ తెలిపారు. విజయవాడ నగరం సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత గుర్తింపు పొందేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమరావతి, విజయవాడ నగరాల గురించే చర్చ జరుగుతోందని కేశినేని చిన్ని అన్నారు. ప్రజల కలల రాజధాని అమరావతిని ఏడాదిన్నరలో ప్రారంభించుకోబోతున్నామని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మార్గదర్శకత్వంలో విజయవాడ ప్రజలందరూ ఉత్సవాలను విజయవంతం చేశారని ఎంపీ తెలిపారు. ఈ విజయానికి సీఎం అందించిన సహకారం, ప్రోత్సాహం, సూచనలే ప్రధాన బలమని పునరుద్ఘాటించారు.
విజయవాడ ఉత్సవ్ సీజన్–2 ముగింపు సందర్భంగా నగర ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది: ఎమ్మెల్యే బోండా ఉమ
విజయవాడ ఉత్సవ్ సీజన్–2 గురించి నేడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిషాసురుడిని సంహరించి లోకానికి విముక్తి కల్పించిన విజయదశమి స్ఫూర్తితో రాష్ట్రంలోని దుష్టశక్తులు అంతరించి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని బోండా ఉమ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు నగరానికి సాంస్కృతికంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ సీజన్–2 ముగింపు సందర్భంగా నిర్వహించిన మెగా కార్నివాల్ నగర ప్రజలకు కనువిందు చేసింది. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను మేళవిస్తూ నిర్వహించిన ఈ ఉత్సవాలు విజయవాడ నగర ప్రతిష్ఠను మరింత పెంచాయి. ప్రజల భాగస్వామ్యం, నిర్వాహకుల సమష్టి కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సహకారంతో విజయవాడ ఉత్సవ్ సీజన్ -2 విజయవవంతం గా ముగిసింది.




