Vijayawada: ఇంద్రకీలాద్రిపై వీహెచ్‌పీ, పరిరక్షణ సమితి వినతిపత్రం

Vijayawada: విజయవాడ దుర్గగుడిలో దసరా ఉత్సవాలపై వీహెచ్‌పీ, ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి వినతి. హుండీ నిధుల మళ్లింపు ఆపాలని, వీఐపీ దర్శనాలు తగ్గించాలని డిమాండ్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 21 Sept 2026 10:02 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై వీహెచ్‌పీ, పరిరక్షణ సమితి వినతిపత్రం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పూర్తిగా భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని కోరుతూ ఈరోజు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వారికి, విశ్వ హిందూ పరిషత్ మరియు ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సంయుక్త వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రంలోని ప్రధాన విజ్ఞప్తులు

1. దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు అమ్మవారి హుండీ కానుకల నుంచి చెల్లింపులను వెంటనే నిలిపివేయాలి.

2. దసరా ఉత్సవాల కోసం ప్రతిపాదించిన రూ.25 కోట్ల ఖర్చుకు సంబంధించిన పూర్తి అంచనాలు (Estimates) ప్రజలకు వెల్లడించాలి.

3. వీఐపీ దర్శనాలను కట్టడి చేసి సామాన్య భక్తులకు వేగవంతమైన, సులభమైన దర్శనం కల్పించాలి.

4. ఇంద్రకీలాద్రిపై విధుల్లో ఇతర మతాలకు చెందిన వారిని నియమించరాదు.

5. ఇంద్రకీలాద్రి మాస్టర్ ప్లాన్ కాపీని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

6. గిరి ప్రదక్షిణ మార్గంలో ఇంద్రకీలాద్రి పర్వత ప్రాంతంలో ఇతర మత చిహ్నాలు లేకుండా పరిరక్షించాలి.

7. ప్రకాశం బ్యారేజీ నుంచి అర్జున్ వీధి వరకు గతంలో ఉన్న సుమారు 45 అడుగుల రహదారిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి.

8. కనకదుర్గ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి భక్తులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేయాలి.

9. పార్కింగ్ చెప్పులు, సెల్‌ఫోన్ కౌంటర్లను భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేయాలి.

10. కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్‌కు రెండో రహదారిని నిర్మించి రద్దీని తగ్గించాలి.

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు, జిల్లా కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహాయ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్, ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అవుటపల్లి శివప్రసాద్, సభ్యులు దుర్గ భవాని, కనీ శెట్టి లక్ష్మణరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యాలు, క్షేత్ర పరిరక్షణ, పారదర్శక పరిపాలన కోసం దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ మరియు ఇంద్రకీలాద్రి పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేశాయి.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.