Vijayawada: ఏపీ మహిళా ప్రీమియర్ లీగ్ టీజర్ విడుదల చేసిన శైలజ

Vijayawada: విజయవాడలో WAPL టీజర్ విడుదల చేసిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ. ఈ నెల 19 నుంచి మంగళగిరిలో టోర్నమెంట్ ప్రారంభం.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 15 Sept 2026 10:00 PM IST
Vijayawada
X

Vijayawada: ఏపీ మహిళా ప్రీమియర్ లీగ్ టీజర్ విడుదల చేసిన శైలజ

విజయవాడ: విజయవాడ( ఏసీఏ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం)ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రీమియర్ లీగ్ (WAPL) టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ, ACA సీఏఓ జై కిషన్ ఆమెను కలిసి డబ్ల్యూఏపీఎల్ నిర్వహణ, టోర్నమెంట్ ప్రత్యేకతలు, మహిళా క్రికెటర్లకు కల్పిస్తున్న అవకాశాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుంచి మహిళా క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించేందుకు డబ్ల్యూఏపీఎల్ ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని అన్నారు. మహిళా క్రికెటర్లు నేడు దేశం గర్వించదగ్గ రీతిలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మహిళా క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది యువ క్రీడాకారిణులు క్రికెట్‌లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు తేజం శ్రీ చరణి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారని, అలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారిణులు మరింత మంది వెలుగులోకి వచ్చేలా డబ్ల్యూఏపీఎల్ ఒక గొప్ప వేదికగా మారుతుందని శైలజ అభిప్రాయపడ్డారు.

మహిళా క్రీడాకారిణులకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నతంగా రాణించగలరని ఆమె అన్నారు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

ఈ నెల 19వ తేదీ నుంచి డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. అమరావతి ప్రాంతమైన మంగళగిరిలో ఇంతటి ప్రతిష్టాత్మక మహిళా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను రాయపాటి శైలజ అభినందించారు.డబ్ల్యూఏపీఎల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళా క్రికెట్ ప్రతిభకు మరింత గుర్తింపు లభిస్తుందని, భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణులు వెలుగులోకి రావాలని ఆమె ఆకాంక్షించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.