Visakhapatnam: విశాఖ బీచ్‌లలో మద్యం చిందులు.. ప్రభుత్వంపై భగ్గుమన్న మహిళా సంఘాలు!
Visakhapatnam: విశాఖ బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐద్వా నిరసన.
Visakhapatnam: విశాఖ బీచ్‌లలో మద్యం చిందులు.. ప్రభుత్వంపై భగ్గుమన్న మహిళా సంఘాలు!
Visakhapatnam: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో విశాఖ, చీరాల బీచ్‌లలో "బీచ్ షాక్ ల" (Beach Shacks) ద్వారా మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శనివారం ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖ RTC కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు, ఆర్.ఎన్. మాధవి, వై. సత్యవతి, జిల్లా ఉపాధ్యక్షులు బి. పద్మ, CITU జిల్లా నాయకురాలు P.మణి మాట్లాడుతూ మహారాష్ట్ర, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్న మద్యం సంస్కృతిని విశాఖకు తీసుకువచ్చి సముద్రతీరాలను మద్యపాన కేంద్రాలుగా మార్చే ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనదని, మహిళా వ్యతిరేకమైనదని పేర్కొన్నారు. విశాఖ, చీరాల బీచ్ లలో ప్రయోగాత్మకంగా బీచ్ షాక్ లు పెడతామని, తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వీళ్ళు మహిళా రక్షకులా? భక్షకులా? అర్ధం కావట్లేదని, బీచ్ లో మద్యం అమ్మకాల పేరుతో యువతను మరింతగా మద్యానికి అలవాటు చేసే విధానాలు అవలంబించడం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దివాళాకోరు వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ఇప్పటికే రాష్ట్రంలో మద్యం మహమ్మారి కారణంగా నేరాల సంఖ్య పెరుగుతోందని, మహిళలపై హింస, లైంగిక దాడులు, కుటుంబ హింసాత్మక ఘటనలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. మద్యం మత్తులో ప్రమాదాలకు గురయ్యి ఎంతో మంది చనిపోతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ప్రభుత్వం మరింత విస్తరిస్తూ ప్రజలను వ్యసనపరులుగా మారుస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్థాలను పూర్తిగా నియంత్రించాలని మహిళా లోకం డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా బీచ్‌లలో సైతం మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం ఖండనీయమన్నారు. మద్యం మత్తుకు బానిసలవుతున్న కొందరు యువకులు, పురుషులు విచక్షణ కోల్పోయి మహిళలు, బాలికలపై దారుణమైన అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం కన్న తల్లిదండ్రులనే హత్య చేసే స్థాయికి సమాజం దిగజారుతుండటం అత్యంత ఆందోళనకరమన్నారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బీచ్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగిస్తే మహిళలు, విద్యార్థినులు, కుటుంబాలు విశాఖ బీచ్ రోడ్డుపై స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. పర్యాటకం పేరుతో మహిళల భద్రతను, స్వేచ్ఛను తాకట్టు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ఇప్పటికే వీధి వీధికి బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, మైనర్లకు మద్యం విక్రయించరాదని, నిర్ణిత సమయం లో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలనే నిబంధనలు ఉన్నప్పటికీ బార్లు, వైన్ షాపులు వాటిని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. గుడి,బడి,నివాస ప్రాంతాలతో మద్యం షాపులు పెట్టకూడదని, ప్రజానీకం వ్యతిరేకించిన చోట మద్యం షాపులు పెట్టరాదన్న నిబంధనలు సైతం పక్కకి పోయాయని, అయినప్పటికీ పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రజానీకాన్ని ఈ రకంగా మద్యం మత్తులో ముంచి, వారిని ఏమార్చి తమ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారనీ విమర్శించారు.
మరోవైపు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సంపాదనలో పెద్ద భాగం మద్యానికే వెళ్తుండగా, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇంటి నిర్వహణ కోసం మహిళలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ శ్రమిస్తున్నారని తెలిపారు. మద్యం కారణంగా కుటుంబాలు అప్పులపాలు అవుతున్నాయని, అనారోగ్యాలు, గృహ హింస, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
సామాన్య ప్రజలు తమ కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఉన్న ఏకైక ఉచిత ప్రజా వేదిక సముద్ర తీరం. అలాంటి ప్రకృతి సంపదను కూడా మద్యపాన కేంద్రంగా మార్చడం దురదృష్టకరమన్నారు. విశాఖ బీచ్ టూరిస్ట్ బీచ్ కాదని,బీచ్ షాక్ లు పెట్టీ గోవా కల్చర్ తీసుకురావడం ప్రమాదకరమని అన్నారు. విశాఖను ఈ స్థాయికి దిగజారుస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
నాడు సారా వ్యతిరేక ఉద్యమాలకు తలొగ్గి మద్యనిషేధం అమలు చేసిన ఎన్టీ రామారావు వారసులమని చెప్పుకునే టీడీపీ నాయకత్వం నేడు మద్యం అనుకూల విధానాలు అవలంబించడం ముమ్మాటికీ ద్వంద్వ నీతి అని విమర్శించారు.
ప్రభుత్వం తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక "బీచ్ షాక్" నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖపట్నం శాంతిభద్రతలను కాపాడాలని, బీచ్‌లను మద్యపాన కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను రద్దు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యువతను, మహిళలను, ప్రజాసంఘాలను పెద్ద ఎత్తున ఏకం చేసి, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉధృతమైన ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు S. కొండమ్మ, ch. సుమిత్ర, R.విమల, G.లక్ష్మీ,V .ప్రభావతి, K.వేణు,k.కుమారి,G.మణి, B.రమణి,B .ఈశ్వరమ్మ, K.మణి, K.మంగవేణి, B.సత్యవతి, కమలమ్మ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




