Vizag: మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రం కుట్ర.. ఐద్వా ఆగ్రహం

Vizag: విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్లపై సదస్సు నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 28 April 2026 5:18 PM IST
Vizag
X

Vizag: మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్రం కుట్ర.. ఐద్వా ఆగ్రహం

Vizag: ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఐద్వా జాతీయ నాయకురాలు S.పుణ్యవతి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు RN.మాధవి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పుణ్యవతి గారు మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం 2023లో ఆమోదం పొందినప్పటికీ,

దాని అమలును డీలిమిటేషన్, జనగణన షరతులతో ముడిపెట్టి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మహిళల హక్కులపై మాటల్లో మద్దతు తెలుపుతూ, కార్యాచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడుతోందని, ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం ఆకర్షణీయ హామీలు ఇస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక నిర్ణయాలను అమలు చేయకుండా నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

మహిళా సాధికారతను నిజంగా కోరుకుంటే, ఎటువంటి షరతులు లేకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక అవరోధాలు, రాజకీయ లాభాపేక్షలు, అధికార వర్గాల నిర్లక్ష్యం కారణంగా ఈ బిల్లు ఎన్నో సంవత్సరాలు నిలిచిపోయిందనీ,

దాదాపు 20 సంవత్సరాలుగా మహిళా సంఘాలు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం ఫలితంగా 2023 లో మహిళా రిజర్వేషన్ల చట్టం సాధించుకున్నామని, చట్టంగా మారిన తర్వాత కూడా అమలు చేయకుండా వాయిదా వేయడం మహిళలతో చేసిన మరో మోసమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాక మాత్రమే అమలు చేస్తామని చెప్పడం ఒక స్పష్టమైన ఆలస్యం చేసే కుట్ర అని, వెంటనే అమలు చేయగలిగే చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం ద్వారా మహిళల రాజకీయ హక్కులను కుదించే ప్రయత్నం జరుగుతోందన్నారు.. ఇది పరిపాలనా సమస్య కాదు — ఇది రాజకీయ సంకల్పం లేకపోవడమే అని.

ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం పెద్ద ఎత్తున హామీలు ఇస్తూ, “బేటీ బచావో – బేటీ పడావో” వంటి నినాదాలను వినిపించిన బీజేపీ ప్రభుత్వం, నిజ జీవితంలో మహిళల రక్షణలో పూర్తిగా విఫలమైంది. దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, పసిపిల్లలపై దారుణాలు పెరుగుతున్నాయి. కానీ నేరస్తులకు కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో నేరస్తులకు రాజకీయ అండ లభించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని వివరించారు.

మహిళల భద్రత మాత్రమే కాదు, వారి జీవన ప్రమాణాలు కూడా క్షీణిస్తున్నాయని, శ్రామిక మహిళలు అసంఘటిత రంగంలో తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, కనీస వేతనాలు, భద్రతా హామీలు లేకుండా పని చేయాల్సి వస్తోందన్నారు .ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలహీనపరచడం వల్ల పేద మరియు మధ్యతరగతి మహిళలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మహిళల సంక్షేమం, హక్కులు క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితి ఏర్పడిందనీ తెలిపారు.

ఈ పరిస్థితుల్లో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెరగడం అత్యవసరం అని, మహిళలు చట్టసభల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటే వారి సమస్యలు, వారి అవసరాలు ప్రధాన చర్చలుగా మారతాయని, మహిళలపై హింసను అరికట్టే చట్టాలు, శ్రామిక మహిళలకు రక్షణ కల్పించే విధానాలు, సమాన అవకాశాల కోసం కొత్త చట్టాలు తీసుకురావడం సాధ్యమవుతుందని వివరించారు. నిజమైన సాధికారత అంటే కేవలం నినాదాలు కాదు — నిర్ణయాల ప్రక్రియలో భాగస్వామ్యం అని,

మహిళా రిజర్వేషన్ల అమలులో ఆలస్యం జరగడానికి ప్రతిపక్షాలను కారణంగా చూపించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత తప్పించుకునే ప్రయత్నమే. అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయగలదు. కానీ అమలు చేయకపోవడం ద్వారా మహిళల హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందనీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని మహిళలకు తెలియచెప్పాలని పిలుపునిచ్చారు.

శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (citu) రాష్ట్ర నాయకురాలు P.మణి మాట్లాడుతూ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం , చట్టసభల్లో నమః మాత్రంగా ఉందని, ఈ అసమానతలు తొలగించాలని మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమించారని అన్నారు. 2010 లో రాజ్య సభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు, పార్లమెంట్ లో 2023 వరకు ఆమోదం పొందలేదంటే మహిళా సంక్షేమం కోసం పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం అవుతుంది అని,

చట్టం అయిన తరువాత ఇప్పటికైనా కేంద్ర అమలుకు మళ్ళీ పోరాటం చేసే దుస్థితి ఏర్పడిందని, మహిళలు కేవలం ఓట్ బ్యాంక్ గా చూసే ధోరణి మారాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని మహిళల పట్ల చిత్తశుద్ధి చూపాలనీ, లేకపోతే మహిళల ఆగ్రహం మరింత పెరిగి దేశవ్యాప్తంగా ఉద్యమాలు మిన్నంటుతాయనీ హెచ్చరించారు.

ఐద్వా జిల్లా కార్యదర్శి Y.సత్యవతి మాట్లాడుతూ మహిళల పోరాటాల ద్వారానే రిజర్వేషన్ల అమలు సాధ్యమని, అందుకు మహిళలంతా ఐక్యం అవ్వాలని,మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అన్ని వర్గాల మహిళలు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఆఫీస్ బేరర్స్ R.విమల, CH.సుమిత్ర, R.వరలక్ష్మి, .V.భారతి, పుష్ప V.ప్రభావతి, S.విజయలక్ష్మి, B.పద్మ, B.ఈశ్వరమ్మ, సంతోషం, స్వర్ణలత, మమత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా ఈ సదస్సు ద్వారా కింది డిమాండ్స్ చేసింది.

డీలిమిటేషన్, జనగణన షరతులు లేకుండా వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.

*చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ తక్షణం కల్పించాలి

*మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు తీసుకోవాలి, నేరస్తులకు రాజకీయ అండ నిలిపివేయాలి.

*శ్రామిక మహిళలకు చట్టబద్ధ రక్షణ, కనీస వేతనాలు, భద్రతా హామీలు కల్పించాలి

*ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి మహిళలకు అందుబాటులోకి తేవాలి.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story