Visakhapatnam: గుడివాడ అమర్నాథ్‌పై అక్కరమాని విజయనిర్మల ఫైర్!

Visakhapatnam: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ VMRDA చైర్‌పర్సన్ విజయనిర్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SHIVA, BHIMILI
Published on: 17 Jun 2026 1:45 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: గుడివాడ అమర్నాథ్‌పై అక్కరమాని విజయనిర్మల ఫైర్!

Visakhapatnam: మహిళల పట్ల అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసి హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర మహిళా సమాజాన్ని తీవ్రంగా కించపరిచిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ VMRDA చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, సిద్ధాంతపరమైన విభేదాలు సహజమైనవేనని, అయితే మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారిని అవమానించే స్థాయికి రాజకీయ చర్చలను దిగజార్చడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన నాయకులు, ఈ రోజు మహిళల ఉనికిని ప్రశ్నించేలా ప్రవర్తించడం సమాజానికి హానికరమని, ఇటువంటి సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక మహిళా నాయకురాలిని లేదా ఒక మంత్రిని ఉద్దేశించినవి మాత్రమే కావని, అవి రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవాన్ని, వారి వ్యక్తిత్వాన్ని నిలువునా దెబ్బతీసే విధంగా ఉన్నాయని విజయనిర్మల మండిపడ్డారు.

​రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై, ప్రజాస్వామ్య పద్ధతుల్లో విమర్శలు చేయాలి కానీ.. మహిళల వ్యక్తిత్వాన్ని, సమాజంలో వారికి ఉన్న గౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం అత్యంత దురదృష్టకరమని, ఇది వారి సంస్కార హీనతను చూపుతోందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు మహిళల పట్ల సదరు నాయకులకు, వారి పార్టీకి ఉన్న సంకుచిత వైఖరిని, పురుషాధిక్య అహంకారాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు.

గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసి, వెంటనే యావత్ మహిళా లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విజయనిర్మల డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే ఇటువంటి ధోరణిని నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం ఎంతమాత్రం సహించదని స్పష్టం చేశారు. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం, ఉనికిని చాటుకోవడం కోసం మహిళల గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలను రాష్ట్రంలోని మహిళా సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా తిప్పికొడుతుందని హెచ్చరించారు.

​ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన మాజీ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా వేదికల ద్వారా మరింతగా ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని, వారి నైతికత ఏ స్థాయిలో ఉందో దీని ద్వారా అర్థమవుతోందని విజయనిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. "మహిళల పట్ల నిజంగా గౌరవం ఉంటే వైసీపీ అగ్ర నాయకత్వం ఈ వ్యాఖ్యలను వెంటనే ఖండించి, మహిళా లోకానికి తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలి.

లేనిపక్షంలో మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న నిజమైన అభిప్రాయం, విధానం ఇదేనని ప్రజలు భావించాల్సి వస్తుంది" అని ఆమె స్పష్టం చేశారు. తెలుగు సంస్కృతిలో మహిళకు అత్యున్నత స్థానం ఉందని, తల్లి, చెల్లి, భార్య, కుమార్తె రూపంలో మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని విజయనిర్మల గుర్తుచేశారు.

అలాంటి మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎప్పటికీ క్షమించరన్నారు. రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు, మహిళల అవమానానికి వేదిక కాకూడదని, గౌరవం లేని ఇటువంటి రాజకీయ సంస్కృతిని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని, గుడివాడ అమర్నాథ్ తక్షణమే బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story