Alluri: బంధవీధి గ్రామంలో కలెక్టర్ నిశాంతి ఆకస్మిక పర్యటన!
Alluri: అల్లూరి జిల్లా SASA కార్యక్రమంలో భాగంగా జి.మాడుగుల మండలం బంధవీధి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ నిశాంతి. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి.
Alluri: బంధవీధి గ్రామంలో కలెక్టర్ నిశాంతి ఆకస్మిక పర్యటన!
Alluri: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, శనివారం బంధవీధి గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌కు గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పశువైద్యశాల వద్ద స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర (SASA) కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛత ప్రాధాన్యతపై గ్రామస్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
గ్రామస్థులతో మమేకమై సమస్యలపై ఆరా
అనంతరం కలెక్టర్ గ్రామంలోని దిగువ బంధవీధి ప్రాంతంలో ఒక ఇంటి అరుగుపై గ్రామస్థులతో కూర్చొని వారితో ఆత్మీయంగా మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల యోగక్షేమాలు, వారికి అందుతున్న ప్రభుత్వ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి సమస్యకు గల కారణాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.16 లక్షల నిధులు
ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీ నాగభూషణం గ్రామంలో తాగునీటి సమస్యకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు వివరించారు. NH-51 పనుల్లో భాగంగా మూడు హ్యాండ్‌పంపులు, ఒక వాటర్ ట్యాంక్, ఒక బావి తొలగించడంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడినట్లు తెలిపారు.
కలెక్టర్ సూచనల మేరకు సమస్య పరిష్కారానికి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు లేఖ రాసి రూ.16 లక్షల నిధులు మంజూరు చేయించుకున్నట్లు ఏఈ శ్రీ నాగభూషణం తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని వివరించారు.
పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు స్థానికంగా టెండర్లు నిర్వహించి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామస్థులు గ్రామంలో డ్రైనేజీ సమస్య కూడా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిశీలించిన కలెక్టర్ మ్యాజిక్ డ్రెయిన్స్ పథకం ద్వారా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో, అక్కడికక్కడే సంబంధిత అధికారులను ఆదేశించి పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.




