Paderu: గిరిజన పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి!

Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్ టి. నిషాంతి పిలుపునిచ్చారు. 'బడి కోసం' పోర్టల్ ద్వారా సాయం చేయవచ్చని తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 3 Sept 2026 2:15 PM IST
Paderu
X

Paderu: గిరిజన పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి!

Paderu: విద్యాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్ టి. నిషాంతి పిలుపునిచ్చారు. మన బడి కోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధికి తమ సహాయసహకారాలు అందించాలనుకున్న దాతల కోసం ప్రభుత్వం 'బడి కోసం' పేరిట పోర్టల్ ప్రవేశపెట్టిందన్నారు. దాని ద్వారా పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సామగ్రి, తదితరాలను దాతలు అందించవచ్చునన్నారు.

చిన్న సహాయం సైతం ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదని, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వర్తకులు, పూర్వవిద్యార్థులు, సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, తదితర దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా 'బడి కోసం' పోర్టల్ను వినియోగించి దాతలు ఎలా సహాయం చేయాలనే అంశాలను సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ వీఏ స్వామినాయుడు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

జిల్లాలో విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి మండల విద్యాశాఖాధికారి ప్రతి రోజూ మూడు పాఠశాలలను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీఈవో, సమగ్ర శిక్ష ఏపీసీ, ఎంఈవోలు క్లస్టర్ హెడ్ మాస్టర్లతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయాలన్నారు.

విద్యాలయాల రోజువారీ కార్యకలాపాలు, పురోగతి, తనిఖీల వివరాలను ప్రతి రోజూ పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ టి. శ్రీపూజను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి. శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఈవో భానుమూర్తిరాజు, టీడబ్ల్యూ డీడీ పీబీకే పరిమిళ, జిల్లాలోని ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story