Sileru: అల్లూరి జిల్లాలో అధ్వానంగా రహదారులు బురదమయంగా మారిన రోడ్లు!
Sileru: అల్లూరి జిల్లా సీలేరు పరిధిలోని దొరగొంది, పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్లు వర్షాలకు బురదమయం. రాకపోకలకు ఆటంకం, రహదారుల నిర్మాణానికి ప్రజల డిమాండ్.
Sileru: అల్లూరి జిల్లాలో అధ్వానంగా రహదారులు బురదమయంగా మారిన రోడ్లు!
Sileru: జీకేవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని దొరగొంది గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు బురదమయమై కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది.
దొరగొంది నుంచి గుమ్మిరేవులకు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దొరగొంది గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ కొంత మేర పనులు చేసి ఆ తరువాత అర్ధంతరంగా నిలిపివేశారు. కాగా గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి బురదమయమై అధ్వానంగా మారింది.
దీంతో గ్రామస్థులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులు, అనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించాలంటే అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
అధ్వానంగా పిల్లిగెడ్డ అప్రోచ్ రోడ్డు
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర రహదారిని కలిపే పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయమై వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం తుఫాన్కు ఈ ప్రాంతంలోని పాత వంతెన కొట్టుకుపోవడం, దీంతో అప్పటికే నిర్మాణంలో ఉన్న కొత్త వంతెన పనులను యుద్ధప్రాతిపదిన పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డుకు మాత్రం ఎర్రమట్టి పోసి వదిలేశారు. దీంతో ఈ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడల్లా అప్రోచ్ రోడ్డు బురదమయమై వాహనదారులు నరకం చూస్తున్నారు. భారీ లోడు వాహనాలు అయితే ఇక్కడ బురదలో కూరుకుపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఈ ప్రాంతీయులు, వాహనదారులు కోరుతున్నారు.




