Alluri: అల్లూరి జిల్లాలో సెప్టెంబర్ 25న నులిపురుగుల నిర్మూలన దినం

Alluri: అల్లూరి జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం, అక్టోబర్ 5న మాప్-అప్ డే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.

SAI, PADERU
Published on: 19 Sept 2026 4:35 PM IST
Alluri
X

Alluri: అల్లూరి జిల్లాలో సెప్టెంబర్ 25న నులిపురుగుల నిర్మూలన దినం

అల్లూరి జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day)ను సెప్టెంబర్ 25న, మాప్‌-అప్‌ డేను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఐఏఎస్ తెలిపారు.

ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి శనివారం పాడేరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, లక్ష్యాలపై సమావేశంలో సమీక్షించారు.

1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారికి ఆల్బెండజోల్‌ మాత్రలు

జిల్లాలో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు, కిశోర బాలబాలికలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 25న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు అక్టోబర్ 5న మాప్‌-అప్‌ డే సందర్భంగా ఆల్బెండజోల్‌ మాత్రలు అందించాలని నిర్ణయించారు.

అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం అవుతుందని

వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి, ఆదేశించారు.

పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు తమ పరిధిలోని అర్హులైన పిల్లలందరికీ మాత్రలు అందేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. మాత్రల నిల్వ, సరఫరా, పంపిణీతో పాటు మాత్రలు తీసుకున్న పిల్లల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసి, సంబంధిత నివేదికలను సకాలంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలి

నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

ముఖ్యంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి ప్రతి కుటుంబానికి కార్యక్రమ సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం సెప్టెంబర్ 25న లేదా ఆ రోజు మాత్రలు తీసుకోలేకపోతే అక్టోబర్ 5న నిర్ణీత కేంద్రాల్లో ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

పిల్లల వయస్సుకు అనుగుణంగా ఆరోగ్య శాఖ సూచించిన విధానంలోనే మాత్రలను అందించాలని, సంబంధిత సిబ్బంది తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్య, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAI, PADERU

SAI, PADERU