Paderu: అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు విడతల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి వెల్లడించారు.
Paderu: అల్లూరి జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు!
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీ అనిల్ చంద్ర పునేఠా, ఐఏఎస్ (రిటైర్డ్) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొని తమ తమ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.
విడతల వారీగా ఎన్నికల షెడ్యూల్, గణాంకాలు:
మొదటి విడత – నవంబర్ 26, 2026: చింతపల్లి, కొయ్యూరు, జి.కె.వీధి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో మొత్తం 66 గ్రామ పంచాయతీలు, 686 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రెండవ విడత – నవంబర్ 29, 2026: పెదబయలు, ముంచింగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో మొత్తం 87 గ్రామ పంచాయతీలు, 880 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడవ విడత – డిసెంబర్ 2, 2026: పాడేరు, అరకు వ్యాలీ, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో మొత్తం 91 గ్రామ పంచాయతీలు, 880 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి:
మూడు విడతలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ వివరించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామగ్రి, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
ఎన్నికల రోజునే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలను కూడా పకడ్బందీగా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మొదటి విడతలో ఏకగ్రీవ ఎన్నికలు:
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు కొయ్యూరు మండలంలో సర్పంచ్ పదవికి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా పంచాయతీ అధికారి కె.పి. చంద్రశేఖర్ తెలిపారు.
అదేవిధంగా మొదటి విడత పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో మొత్తం 132 వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.
మిగిలిన స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది ఎన్నికల నియమావళిని పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.




