Anakapalle: ఖజానా శాఖలో అవినీతి అట్టహాసం ‘మామూళ్లు’ ఇస్తేనే ఫైలు కదిలేది

Anakapalle: అనకాపల్లి జిల్లా ఖజానా కార్యాలయాల్లో పెచ్చుమీరిన అవినీతి. నర్సీపట్నం ఎస్టీవోలో ఏసీబీకి దొరికిన సీనియర్ అకౌంటెంట్, బిల్లుల ఆమోదానికి పర్సంటేజీల వసూళ్లు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 30 Aug 2026 11:11 AM IST
Anakapalle
X

Anakapalle: ఖజానా శాఖలో అవినీతి అట్టహాసం ‘మామూళ్లు’ ఇస్తేనే ఫైలు కదిలేది

Anakapalle: అనకాపల్లి జిల్లాలోని ఖజానా శాఖ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా ఉద్యోగులు, సిబ్బంది చేతులు తడపాల్సిందేననే ఆరోపణలు వినవస్తున్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు.

జిల్లా కేంద్రం అనకాపల్లిలో జిల్లా ఖజానా కార్యాలయంతో పాటు మరో ఏడు ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. ఆయ కార్యాలయాల్లో ప్రతి బిల్లుకు కొంత 'పర్సంటేజీ' ఇస్తేనే పని సులువుగా జరుగుతుందన్న విమర్శలున్నాయి. తాజాగా నర్సీపట్నం ఉప ఖజానా కార్యాలయంలో రిటైర్డ్ తహసిల్దార్ తనకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు సమర్పించడంతో దానిని మంజూరు చేయడానికి సీనియర్ అకౌంటెంట్ రూ.40 వేలు లంచం డిమాండ్ వేసి రూ.30 వేలు తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది ఆ శాఖలో పెచ్చుమీరిన అవినీతిని తెలియజేస్తోంది.

అంతా ఆన్లైన్ అయినా లంచం ఇవ్వాల్సిందే

వాస్తవానికి సెంట్రలైజ్డ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) విధానంలో అన్ని ప్రభుత్వ శాఖల వివిధ రకాల బిల్లులన్నీ ఆన్లైన్లోనే సమర్పించడం, పరిశీలించడం, పాస్ చేయడం జరుగుతుంది. దీంతో ఉద్యోగుల జోక్యం తగ్గి అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 45కిపైగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాల ఉద్యోగుల జీతభత్యాలు, సరండర్ లీవ్లు, ఈఎల్లు, జీపిఎస్, పిఎఫ్, జీఐఎస్, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులతో పాటు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు ఖజానా కార్యాలయాల ద్వారానే చెల్లింపులు జరుగుతుంటాయి. ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయినా బిల్లు సిఎఫ్ ఎంఎస్లో లో అప్లోడ్ చేసిన తరువాత సంబంధిత ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని కలవకపోతే కొర్రీలు వేస్తారని, చిన్నచిన్న కారణాలతో బిల్లులను వెనక్కి పంపుతున్నారని పలువుడు వాపోతున్నారు.

పాయకరావుపేట ఉప ఖజానా కార్యాలయ పరిధిలో ఇటీవల ఉద్యోగవిరమణ చేసిన ఒక ఉద్యోగి ఆరు నెలలుగా బిల్లులు పాస్ చేయండి మహాప్రభో అంటూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నా, కాసుల బేరం కుదరక పని జరగడం లేదని తెలిసింది. దీంతో ఆయన ఉద్యోగ సంఘ నాయకులను ఆశ్రయించి తన గోడు వెల్లబుచ్చుకున్నారు. పీఎఫ్ సెటిల్మెంట్ ఫైళ్లు, కార్యాలయ నిర్వహణ ఖర్చుల బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని ముందుగా సంప్రతించి మాట్లాడుకుంటే ప్రక్రియ సాఫీగా జరుగుతుందని పలువురు ఉద్యోగులు నెబుతున్నారు. ఎవరైనా బేరం కుదుర్చుకోకుండా బిల్లులు పెట్టాం కదా, వస్తాయిలే అనుకుంటే నెలల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిందేనని అంటున్నారు.

పర్సంటేజ్ ఇస్తేనే జిల్లా ఖజానా కార్యాలయం పరిధిలోని ఉప ఖజానా కార్యాలయాల్లో ఒక ఎన్టీవో, ఏటీఓ, ఇద్దరు సీనియర్ అకౌంటెంట్లు, మరో ఇద్దరు జూనియర్ అకౌంటెంట్లు ఉంటారు. కార్యాలయాల నుంచి వచ్చే ఆన్లైన్ బిల్లులు వీరు పరిశీలించిన తరువాతే ఎస్ అవుతాయి. ఉప ఖజానా కార్యాలయంలో ఒక అకౌంటెంట్ నాలుగు నుంచి ఆరు ప్రభుత్వ శాఖల బిల్లులు పరిశీలించాల్సి ఉంటుంది. బిల్లుల పరిశీలన అనంతరం ఏటీఓ, డీటీఓలు ఒకే చెబితేనే బిల్లులు పాస్ అవుతాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక చెల్లింపులు జరుగుతాయి.

ఉప ఖజానా కార్యాలయలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల పీఎఫ్ సెటిల్మెంట్లు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వివిధ ప్రభుత్వ చెల్లింపులకు సంబంధించిన బిల్లులే వస్తుంటాయి. వీటిలో ప్రతి బిల్లుకూ ఎంతో కొంత చెల్లిస్తేనే అది మంజూరు అవుతుంది. రూ. లక్షకు 2 నుంచి 5 శాతం వరకు పర్సంటేజీలు వసులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన రూ. లక్ష బిల్లు ఉప ఖజానా కార్యాలయంలో పాస్ అయితే, సంబంధిత ఉద్యోగి రూ.2 వేలు లంచం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తం అయితే కాస్త ఎక్కువ పర్సంటేజ్ చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా కాంట్రాక్టర్ల బిల్లులు మంజూలైన వెంటనే పర్సంటేజీ పేరుతో వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఉప ఖజానా కార్యాలయాల్లో అయితే బిల్లుల కోసం వచ్చే వివిధ శాఖల నుంచి స్టైలిఫ్ రికార్డులను (ప్రతి నెలా ఆ శాఖ ఉద్యోగులకు చెల్లించే జీతాల బిల్లుల వివరాల నమోదు పట్టిక) కూడా కొనిపించి వారితోనే రాయిస్తున్నారని తెలిసింది. ఉప ఖజానా కార్యాలయాలకు, సంబంధిత శాఖలకు మధ్యవర్తులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు వ్యవహరిస్తుంటారని సమాచారం. వీరి ద్వారానే బేరం కుదుర్చుకుంటున్నట్టు తెలిసింది.

ఉప ఖజానా కార్యాలయాల్లో బిల్లుల విషయంలో వసూళ్లు జరుగుతున్నట్టు జిల్లా ఖజానా అధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దిగువ స్థాయి కార్యాలయాల్లో వసూలైన పర్సంటేజిల్లో కొంతమొత్తం పైస్థాయికి కూడా చేరుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారులు మాత్రం

బిల్లులన్నీ సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్లోనే ప్రాసెస్ అవుతున్నందున అక్రమాలకు అవకాశం లేదని చెబుతున్నారు.

జిల్లాలోని అన్ని ఉప ఖజానా కార్యాలయాల్లో బిల్లుల ప్రాసెసింగ్ విధానంపై సమగ్రంగా విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story