Anakapalle: 111వ వార్డులో కూటమి ప్రచార హోరు – ఎమ్మెల్యే కొణతాల!

Anakapalle: అనకాపల్లి 111వ వార్డులో కూటమి ప్రచార హోరు. బీజేపీ అభ్యర్థి ఫాలక యశోద తరఫున వర్షంలోనూ ప్రచారం చేసిన ఎమ్మెల్యే కొణతాల, పీలా గోవింద్, రామ్కీ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 27 Oct 2026 10:54 PM IST
Anakapalle
X

Anakapalle: 111వ వార్డులో కూటమి ప్రచార హోరు – ఎమ్మెల్యే కొణతాల!

అనకాపల్లి: జీవీఎంసీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జోన్‌ పరిధిలోని 111వ వార్డులో కూటమి అభ్యర్థి ఫాలక యశోద ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీకి కేటాయించిన ఈ వార్డులో కమలం గుర్తుపై పోటీ చేస్తున్న యశోదకు మద్దతుగా కూటమి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కీ తదితర ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సపోర్ట్ గణేష్ సైతం ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థికి మద్దతు తెలిపారు.

వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుంటున్న నాయకులు, కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన చోట ఓటర్లు ఆదరిస్తున్నారని కూటమి శ్రేణులు చెబుతున్నాయి. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.

మరోవైపు, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచార కార్యక్రమాలకు విరామం ఇవ్వకుండా కూటమి శ్రేణులు ముందుకు సాగాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కొనసాగిన ప్రచారం 111వ వార్డులో రాజకీయ వేడిని మరింత పెంచింది.

మొత్తంగా 111వ వార్డులో ఫాలక యశోదకు మద్దతుగా కూటమి ముఖ్య నాయకులంతా ప్రచార బరిలోకి దిగడంతో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI