Anakapalli: పల్లె వారి వీధికి మహర్దశ - 40 అడుగుల రహదారి నిర్మాణం

Anakapalli: అనకాపల్లి పల్లె వారి వీధి నుంచి హైవేను కలుపుతూ 40 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు. పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 Sept 2026 4:31 PM IST
Anakapalli
X

Anakapalli: పల్లె వారి వీధికి మహర్దశ - 40 అడుగుల రహదారి నిర్మాణం

అనకాపల్లి: జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని పాత 82వ వార్డు, ప్రస్తుత 110వ డివిజన్‌లో ఉన్న పల్లె వారి వీధికి మహర్దశ రానుంది. స్థానికుల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా పల్లె వారి వీధి నుంచి ఉమ్మలాడ హైవేను కలుపుతూ 40 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం పల్లె వారి వీధిలో పర్యటించారు. ప్రతిపాదిత రహదారి మార్గాన్ని పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన అంచనాలను అధికారులతో చర్చించారు. పల్లె వారి వీధి నుంచి హైవేను అనుసంధానిస్తూ సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కొణతాల ఆదేశించారు.

పట్టణ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రహదారి అందుబాటులోకి వస్తే పట్టణం నుంచి హైవేకు చేరుకునే వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

అదేవిధంగా కొత్త రహదారి నిర్మాణంతో పల్లె వారి వీధి ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడి అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. అపార్ట్మెంట్లు, గృహ నిర్మాణాలకు మార్గం సుగమం కానుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పల్లె వారి వీధి నుంచి హైవేను కలుపుతూ రహదారి నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా స్థానికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొణతాల ప్రత్యేక దృష్టి సారించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే పర్యటనలో జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి, ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఆళ్ల రామచంద్రరావు, ఇంజనీరింగ్ ఈఈ, ఏఈ, ఎలక్ట్రికల్ ఏఈతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI