Anakapalli: జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలి – ఏపీ రైతు సంఘం
Anakapalli: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నందున అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
Anakapalli: జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలి – ఏపీ రైతు సంఘం
అనకాపల్లి: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఏపీ రైతు సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
వర్షాలు లేక వరి నారుమళ్లు పూర్తిగా ఎండిపోయాయని, ప్రస్తుతం వర్షాలు కురిసినా ఇప్పటికే నష్టపోయిన రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి దుక్కులు, విత్తనాలు, నారుమళ్లు, నాట్లకు పెట్టుబడులు పెట్టిన రైతులు వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలకు జీరాంజీ పథకం ద్వారా విస్తృతంగా ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఏపీ రైతు సంఘం ప్రతినిధులు వై.ఎన్. భద్రం, కోరుబిల్లి శంకరరావు, పప్పల ఈశ్వరరావు, కండుబోతు సత్తిబాబు (బుజ్జి), మత్తుర్తి సూరిబాబు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.




