Anakapalli: గోల్డెన్ అవర్‌లో స్పందించి ప్రమాద బాధితుడికి ప్రాణదానం చేసిన ఏఎస్పీ
Anakapalli: అనకాపల్లిలో గోల్డెన్ అవర్‌లో స్పందించి రోడ్డు ప్రమాద బాధితుడికి ప్రాణదానం చేసిన క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్. మోహన్ రావు. అభినందిస్తున్న స్థానికులు.
Anakapalli: గోల్డెన్ అవర్‌లో స్పందించి ప్రమాద బాధితుడికి ప్రాణదానం చేసిన ఏఎస్పీ
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మూగ, చెవిటి యువకుడిని గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు అనకాపల్లి క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్. మోహన్ రావు. ఈ ఘటన అనకాపల్లి మండలం శంకరం కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
రోలుగుంట మండలం రాజుపేట గ్రామానికి చెందిన పి. సతీష్ అనే యువకుడు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అనకాపల్లి క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్. మోహన్ రావు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపారు.
క్షతగాత్రుడి పరిస్థితిని గుర్తించిన అడిషనల్ ఎస్పీ ఆలస్యం చేయకుండా అతడిని తన వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే సతీష్ మూగ, చెవిటి వ్యక్తి కావడంతో తన వివరాలను తెలియజేయలేకపోయారు.
ఈ క్రమంలో అనకాపల్లి రూరల్ హెడ్ కానిస్టేబుల్ చంటిబాబు, హోంగార్డు రాజ్‌కుమార్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడికి అవసరమైన సహాయాన్ని అందించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని కేజీహెచ్‌కు తరలించాల్సి రావడంతో, బంధువుల కోసం వేచి చూడకుండా పోలీసు సిబ్బంది స్వయంగా ఎస్కార్ట్‌గా వెళ్లి కేజీహెచ్‌లో చేర్పించారు.
మరోవైపు అనకాపల్లి రూరల్ సీఐ, ఎస్ఐలు ఆసుపత్రికి వెళ్లి అక్కడ లభించిన ఆధారాల ఆధారంగా క్షతగాత్రుడు రోలుగుంట మండలం రాజుపేట గ్రామానికి చెందిన పి. సతీష్‌గా గుర్తించారు. అనంతరం అతడి బంధువులకు సమాచారం అందించి కేజీహెచ్‌కు పంపించారు.
గోల్డెన్ అవర్లోనే వైద్యం అందేలా అడిషనల్ ఎస్పీ మోహన్ రావు స్పందించడం, అనంతరం బంధువుల కోసం వేచి చూడకుండా రూరల్ పోలీసు సిబ్బంది బాధితుడిని కేజీహెచ్‌కు తరలించడం వల్ల సతీష్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో సకాలంలో స్పందించిన పోలీసు అధికారుల చర్యలపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.




