Anakapalli: అనకాపల్లి టు అయోధ్య ప్రత్యేక రైలు ప్రారంభం
Anakapalli: అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు.
Anakapalli: అనకాపల్లి టు అయోధ్య ప్రత్యేక రైలు ప్రారంభం
Anakapalli: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సీఎం రమేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నుంచి తొలి విడత అయోధ్య–కాశి ఆధ్యాత్మిక యాత్రకు ఘనంగా శ్రీకారం చుట్టారు.
అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ప్రత్యేక రైలుకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తొలి విడతలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన భక్తులు అయోధ్య, కాశి పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక యాత్ర ద్వారా భక్తులకు అయోధ్యలో శ్రీరాముడి దర్శనం, కాశీ విశ్వనాథ స్వామి దర్శనం కల్పించడం తమకు ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విడతల్లో అర్హులైన భక్తులకు ఈ యాత్రను కొనసాగిస్తామని వెల్లడించారు.
యాత్రకు బయలుదేరిన భక్తులు ఎంపీ సీఎం రమేష్‌కు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రత్యేక రైలు అయోధ్య–కాశి యాత్రకు బయలుదేరింది.




