Chodavaram: కరువు పరిస్థితుల్లో ఆరుతడి పంటలే మేలు ఎన్జీరంగా వర్సిటీ VC!

Chodavaram: చోడవరం సైతారుపేట, సర్వసిద్ధి గ్రామాల్లో ఎన్జీరంగా వర్సిటీ VC పివి సత్యనారాయణ పర్యటన. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచన.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 30 Aug 2026 11:19 AM IST
Chodavaram
X

Chodavaram: కరువు పరిస్థితుల్లో ఆరుతడి పంటలే మేలు ఎన్జీరంగా వర్సిటీ VC!

Chodavaram: ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల్లో ప్రస్తుతం ఆరుతడి పంటలపై దృష్టి పెట్టడమే మేలని ఆచార్య ఎన్నో రంగా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ పీవీ సత్యనారాయణ సూచించారు. ఎల్ నినో ప్రభావిత వ్యవసాయ క్షేత్రాల సందర్శనలో భాగంగా మండలంలోని సైతారుపేట, సర్వసిద్ధి గ్రామాల్లో పలువురు శాస్త్రవేత్తలతో కలిసి శనివారం ఆయన పర్యటించి, పలు పంట భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్సినో కారణంగా ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు వరిసాగు విస్తీర్ణంపై ఎంతో ప్రభావం చూపిస్తుందని తెలిపారు. చాలా చోట్ల నారుమళ్ళు ముదిరి ఎండిపోతున్నాయని, అంతేకాకుండా వరి వెదజల్లిన పొలాల్లో కూడా నీరు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. జిల్లాలో 56,500 హెక్టార్లలో వరిసాగుకు గాను 7,300 హెక్టార్లలో మాత్రమే నారు మడులలోవరిసాగు జరుగుతుందని ఆయన తెలిపారు. సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో ఎప్పుడూ లేని కరువు కనిపిస్తున్నదన్నారు.

అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పటికీ ఎండ తీవ్రత, వేడి గాలులకు తేమ తగ్గడం జరుగుతుందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాభావం 45 నుంచి 50 శాతం మాత్రమే నమోదైందని ఆయన తెలిపారు. ఈ కరువు పరిస్థితుల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తగిన వర్షపాతం నమోదైతే ఆయా ప్రాంతాల అనుకూలతను బట్టి ఆరుతడి పంటలైన చోడి, ఉలవలు, గంట్లు, రాగి, నువ్వులు, మొక్కజొన్న, పెసర, మినుము, సామ, కొర్ర, విత్తనోత్పత్తికి జనుము వంటి పంటలు సాగు చేసుకోవచ్చని రైతులకు ఆయన సూచించారు.

ఈ ప్రాంతంలో నువ్వులు ఎక్కువగా పండే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.అప్పలస్వామి, డాక్టర్ బి.రవికుమార్, డాక్టర్ ఉమామహేశ్, డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి, మండల వ్యవసాయాధికారిణి సౌజన్య, తాజా మాజీ సర్పంచ్ రావి రమణబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story