Anakapalli: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు
Anakapalli: అనకాపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్ష. బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, గంజాయి అణచివేతపై చర్చ.
Anakapalli: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు
అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ మరియు జిల్లా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా తో కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రమాదాల సంఖ్య మరియు ప్రాణనష్టం (Fatal accidents) తగ్గినట్లు పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు మరియు త్రీ-వీలర్స్ ప్రమాదాలకు గురవుతున్నట్లు గుర్తించారు.
గాయపడిన వారిలో 25 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు ఎక్కువగా ఉన్నారని, ఉదయం 9 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల వరకు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశముందని గుర్తించి, ఆ సమయాల్లో వాహనాల తనిఖీలు మరియు నిఘాను పెంచామని కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, స్పీడ్ లేజర్లు మరియు బాడీ వార్న్ కెమెరాల వినియోగం పెంచినట్లు అలాగే బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీసింగ్ పెంచినట్లు వెల్లడించారు.
నేషనల్ హైవేలపై జరిగే ప్రమాదాలను అరికట్టడానికి వాహనాల వేగాన్ని నియంత్రించడమే మార్గమని తెలిపారు. దీని కోసం తాత్కాలిక బారికేడ్లు, రంబుల్ స్ట్రిప్స్ (Rumble strips) మరియు మీడియా ఓపెనింగ్స్ కవర్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని, ఇంజనీరింగ్ లోపాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని తెలిపారు. వాహనదారులు లేన్ డిసిప్లిన్ పాటించాలని, రోడ్డు సంకేతాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. రోడ్లపై అనధికారిక పార్కింగ్, అనుమతి లేని కటింగ్స్/ఓపెనింగ్స్ వంటి సమస్యలను తక్షణమే సరిచేయాలని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత అధికారులు (NH, R&B, పంచాయతీ రాజ్) స్థలాన్ని పరిశీలించి, అది రోడ్డు నిర్మాణం వల్ల జరిగిందా లేదా మానవ తప్పిదం వల్ల జరిగిందా అని నిర్ధారించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కేవలం డేటా ఎంట్రీకే పరిమితం కాకుండా, 24 గంటల వ్యవధిలో పోలీస్ మరియు సంబంధిత శాఖల (R&B, పంచాయతీ రాజ్ మొదలైనవి) అధికారులతో కూడిన జాయింట్ ఆడిట్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం ఓవర్ స్పీడింగ్, రోడ్డు నిర్మాణం, లేదా పొదల వల్ల చూపు ఆనకపోవడం వంటి కారణాల వల్ల జరిగిందా అని విశ్లేషించి, వారం రోజుల్లోగా తగిన సరిదిద్దే చర్యలు (Corrective Measures) చేపట్టాలని తెలిపారు.
జిల్లాలోని 22 సాధారణ 108 అంబులెన్స్‌లతో పాటు, అన్ని సీహెచ్‌సీ (CHC)లలో కంపెనీల సీఎస్‌ఆర్ (CSR) నిధులతో అధునాతన 'అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్' (ALS) అంబులెన్స్‌లను అందుబాటులో ఉన్నాయని, ప్రమాద సమయాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడానికి సమీపంలో ఉన్న సీహెచ్‌సీ వైద్యులను మరియు ALS అంబులెన్స్‌లను ఎలా ఉపయోగించుకోవాలో పోలీసు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు.
గంజాయి నిరోధం, PIT-NDPS చట్టం అమలుపై సమీక్ష
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నిరోధం, పిట్ ఎన్డీపీఎస్ (PIT-NDPS) చట్టం అమలు మరియు నమోదైన కేసులపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి స్వాధీనం, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై తీసుకుంటున్న చర్యలను వివరంగా కలెక్టర్ కు వెల్లడించారు.
గత సమీక్షా సమావేశంతో పోలిస్తే, ఈ నెలలో 17 గంజాయి కేసులను నమోదు చేసి, దాదాపు 14,028 కిలోల గంజాయిని, 18.92 కిలోల హాషిష్ ఆయిల్ (Hashish Oil) ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. PIT-NDPS నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల పదేపదే నేరాలకు పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఈగల్ యాక్టివిటీస్, అభయ యాక్టివిటీస్ లపై తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్స్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కెష్ లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ (PM-RAHAT) పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, అనకాపల్లి ఇన్చార్జి ఆర్డిఓ వై. శ్రీనివాసరావు, డీఎస్పీలు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.




