Anakapalli: అనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ 25న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day)ను సెప్టెంబర్ 25న, మాప్-అప్ డేను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, నిర్దేశించిన లక్ష్యాలపై సోమవారం కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన పిల్లలు, కిశోర బాలబాలికలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, ఏ ఒక్క అర్హుడు కూడా మాత్రలు తీసుకోకుండా మిగలకుండా చూడాలని తెలిపారు.
చిన్నపిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలను వారి వయస్సుకు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు అవసరమైతే పొడి చేసి నీటిలో కలిపి అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పిల్లలు ఇబ్బందికి గురికాకుండా మాత్రలను సులభంగా తీసుకునేలా ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 25న మాత్రలు తీసుకోలేకపోయిన వారికి అక్టోబర్ 5న నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా నులిపురుగుల నిర్మూలన మాత్రలు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. అచ్యుతకుమారి మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహణకు సంబంధించి చేపడుతున్న చర్యలు, లక్ష్యాలు, శాఖల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలను సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్య, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు సమన్వయంతో పనిచేయనున్నట్లు తెలిపారు.




