Anakapalli: కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం - కలెక్టర్ విజయ కృష్ణన్
Anakapalli: అనకాపల్లిలో డీఐఈపీసీ సమావేశం. కొత్త పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం.
Anakapalli: కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం - కలెక్టర్ విజయ కృష్ణన్
అనకాపల్లి: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపన, నూతన ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతుల ప్రక్రియపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో అధికారులతో సమీక్షించారు.
ముందుగా గత డీఐఈపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, యాక్షన్ టేకన్ రిపోర్ట్‌పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సింగిల్ డెస్క్ పాలసీ ద్వారా పరిశ్రమలకు మంజూరు చేయాల్సిన వివిధ క్లియరెన్సులు, అనుమతుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వివిధ శాఖల అనుమతులు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సులను నిర్ణీత సమయంలో మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
కొత్త పరిశ్రమల స్థాపనతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పీకేపీ ప్రసాద్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




