Anakapalli: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి: కలెక్టర్ విజయ కృష్ణన్!
Anakapalli: యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పనే ధ్యేయం: కలెక్టర్ విజయ కృష్ణన్. రెన్యూ సంస్థతో ఒప్పందం, అచ్యుతాపురంలో తొలిదశలో 300 మందికి శిక్షణ.
Anakapalli: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి: కలెక్టర్ విజయ కృష్ణన్!
అనకాపల్లి, సెప్టెంబర్ 22: జిల్లాలోని యువతకు, ముఖ్యంగా మహిళలకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం M/s Renew Pvt. Ltd. సంస్థతో నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒప్పందం ద్వారా జిల్లాలోని యువతకు సాంకేతిక, ఉద్యోగ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలో 300 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అచ్యుతాపురంలోని APIIC ONE-STOP CENTREలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని అక్టోబర్ నెల నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్థానిక యువతకు ఈ రంగంలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబ, సామాజిక అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ద్వారా నైపుణ్యం–ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
యువత, ముఖ్యంగా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరీర్‌కు బలమైన పునాది వేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో M/s Renew Pvt. Ltd. CEO సంజయ్ వర్గీస్, Renew Photovoltaics ప్రతినిధులు జితేంద్ర, త్రిభవన్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ PKP ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జారీ: డివిజనల్ పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి.




