Anakapalli: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు - కలెక్టర్ హెచ్చరిక

Anakapalli: అనకాపల్లి జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అక్రమ స్కానింగ్ కేంద్రాలపై చర్యలకు ఆదేశం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 5 Sept 2026 8:08 PM IST
Anakapalli
X

Anakapalli: లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు - కలెక్టర్ హెచ్చరిక

అనకాపల్లి: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం–1994ను జిల్లాలో పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడే వైద్యులు, సిబ్బంది, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో పాటు, లింగ నిర్ధారణను ప్రోత్సహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన PC-PNDT చట్టంపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో స్త్రీ, పురుష జననాల నిష్పత్తిలో సమతుల్యత సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆడపిల్లల జననాల నిష్పత్తి తక్కువగా నమోదవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

లింగ సమానత్వాన్ని, జనన నిష్పత్తిలో సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడశిశువు అని తెలుసుకుని గర్భస్రావం చేయించే ఘటనలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.

ఇలాంటి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు లేదా ఆడశిశువు గర్భస్రావానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు టోల్‌ఫ్రీ నంబర్ 1800 233 2447కు లేదా PC-PNDT ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అలాగే జిల్లా స్థాయిలో ప్రోగ్రామ్ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అచ్యుత కుమారి, DCHS డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ అధికారులు, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, జిల్లా గణాంక అధికారి రామచంద్రరావు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story