Anakapalli: గవరపాలెం సంతబయలు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: సీపీఎం

Anakapalli: అనకాపల్లి నూకాంబిక ఆలయ మార్గంలోని రూ.40 కోట్ల విలువైన గవరపాలెం సంతబయలు ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 7 Oct 2026 2:56 PM IST
Anakapalli
X

Anakapalli: గవరపాలెం సంతబయలు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: సీపీఎం

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని నూకాంబిక ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న గవరపాలెం సంతబయలు (ఆదివారం సంత) ప్రభుత్వ స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సీపీఎం అనకాపల్లి మండల కమిటీ డిమాండ్ చేసింది.

సుమారు 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలం విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని సీపీఎం పేర్కొంది. ఈ స్థలాన్ని కొందరు వ్యక్తులు అనధికారికంగా వినియోగించుకుంటూ చిరువ్యాపారుల నుంచి అద్దెలు, ఆశీలు పేరుతో భారీగా నగదు వసూలు చేస్తున్నారని సీపీఎం అనకాపల్లి మండల కమిటీ కన్వీనర్ గంటా శ్రీరామ్ ఆరోపించారు.

స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి చికెన్, మటన్ తదితర దుకాణాలు నిర్వహిస్తున్నారని, ఒక్కో దుకాణం నుంచి వారానికి సుమారు రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం జరిగే సంతలోనూ ఎలాంటి రశీదులు ఇవ్వకుండా నగదు వసూళ్లు జరుగుతున్నాయని సీపీఎం ఆరోపించింది.

ఏళ్ల తరబడి ఈ విధంగా లక్షలాది రూపాయలు వసూలు అవుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఎం పేర్కొంది. మున్సిపల్ రికార్డుల్లో సంతబయలు పేరుతో అసెస్మెంట్ ఉన్నప్పటికీ, ఆస్తి పన్ను చెల్లిస్తున్న స్థలం నుంచి ఆశీలు వసూలు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్న పరిస్థితిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

ప్రభుత్వ స్థలాన్ని తక్షణమే స్వాధీనం చేసుకుని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకోవాలని, అక్రమంగా ఆశీలు వసూలు చేస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఎం కోరింది. అలాగే ఇప్పటివరకు వసూలైన మొత్తాలపై ఆడిట్ నిర్వహించి, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రికవరీ చేయాలని సీపీఎం అనకాపల్లి మండల కమిటీ డిమాండ్ చేసింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI