Anakapalli: రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి కట్టడిపై కలెక్టర్ సమీక్ష
Anakapalli: అనకాపల్లిలో రోడ్డు భద్రత, గంజాయి అణచివేతపై కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్ష. జాయింట్ ఆడిట్ బృందాల ఏర్పాటుకు ఆదేశం.
Anakapalli: రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి కట్టడిపై కలెక్టర్ సమీక్ష
అనకాపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యతో పాటు ప్రాణనష్టం కూడా తగ్గినట్లు పోలీసు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అయితే ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రమాదాల్లో గాయపడుతున్న వారిలో 25 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువత అధికంగా ఉన్నట్లు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయాల్లో వాహన తనిఖీలు, నిఘాను పెంచినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, స్పీడ్ లేజర్లు, బాడీ వార్న్ కెమెరాల వినియోగాన్ని పెంచడంతో పాటు బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసింగ్‌ను ముమ్మరం చేసినట్లు వివరించారు.
నేషనల్ హైవేలపై ప్రమాదాల నివారణకు వాహనాల వేగాన్ని నియంత్రించడం కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం తాత్కాలిక బారికేడ్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం, అనధికారిక మీడియన్ ఓపెనింగ్స్‌ను మూసివేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రోడ్డు నిర్మాణ లోపాలపై తక్షణ చర్యలు
ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ రహదారులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ లోపాల కారణంగా ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనదారులు లేన్ డిసిప్లిన్ పాటించేలా అవగాహన కల్పించాలని, రోడ్డు సంకేతాలపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు.
రోడ్లపై అనధికారిక పార్కింగ్, అనుమతి లేని కటింగ్స్, ఓపెనింగ్స్ వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి రోడ్డు నిర్మాణ లోపమా, మానవ తప్పిదమా అనే అంశాన్ని నిర్ధారించాలని తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కేవలం డేటా ఎంట్రీకే పరిమితం కాకుండా 24 గంటల్లోపు పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కూడిన జాయింట్ ఆడిట్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓవర్‌స్పీడింగ్, రోడ్డు నిర్మాణ లోపాలు, పొదల కారణంగా చూపు సరిగా లేకపోవడం తదితర కారణాలను విశ్లేషించి, వారం రోజుల్లోగా తగిన సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు.
అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో 22 సాధారణ 108 అంబులెన్స్‌లతో పాటు అన్ని సీహెచ్‌సీలలో కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతో అధునాతన అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సహాయం అందించేందుకు సమీపంలోని సీహెచ్‌సీ వైద్యులు, ALS అంబులెన్స్‌లను సమర్థవంతంగా వినియోగించుకునే విధానంపై పోలీసులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
అనంతరం జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నిరోధం, PIT-NDPS చట్టం అమలు, నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు. గంజాయి స్వాధీనం, పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై తీసుకుంటున్న చర్యలను పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్‌కు వివరించారు.
గత సమీక్షతో పోలిస్తే ఈ నెలలో 17 గంజాయి కేసులు నమోదు చేసి, సుమారు 14,028 కిలోల గంజాయి, 18.92 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. PIT-NDPS చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పదేపదే నేరాలకు పాల్పడే వారి సంఖ్య తగ్గిందని, పలువురు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు వివరించారు.
గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈగల్ యాక్టివిటీస్, అభయ యాక్టివిటీస్‌పై తీసుకుంటున్న చర్యలను కూడా కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్స్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ (PM-RAHAT) పోస్టర్‌ను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, అనకాపల్లి ఇన్‌చార్జి ఆర్డీఓ వై. శ్రీనివాసరావు, డీఎస్పీలు, పోలీసు అధికారులు, జిల్లా అధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.




