Anakapalli: జనసేన కార్యాలయంలో మహాకవి గురజాడ 164వ జయంతి వేడుకలు

Anakapalli: అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి. పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి, కూటమి నాయకులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 21 Sept 2026 4:33 PM IST
Anakapalli
X

Anakapalli: జనసేన కార్యాలయంలో మహాకవి గురజాడ 164వ జయంతి వేడుకలు

అనకాపల్లి: తెలుగు సాహితీ లోకానికి అభ్యుదయ భావజాలాన్ని పరిచయం చేసిన మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు గురజాడ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు 164వ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమన్నారు. గురజాడ అప్పారావు అనకాపల్లి జిల్లా బిడ్డ కావడం జిల్లావాసులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

1862 సెప్టెంబర్ 21న రాయవరం గ్రామంలో జన్మించిన గురజాడ తెలుగు సాహిత్యంలో వాడుక భాషకు ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. ‘కన్యాశుల్కం’ వంటి కాలజయ నాటకం ద్వారా బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సామాజిక దురాచారాలపై ఆయన తన రచనల ద్వారా పోరాటం చేశారని పేర్కొన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ వందేళ్ల క్రితమే సమాజానికి గొప్ప సందేశాన్ని అందించారని కొనియాడారు.

గురజాడ రచనల్లోని గిరీశం, మధురవాణి వంటి పాత్రలను నేటి యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థి ‘కన్యాశుల్కం’ నాటకంతో పాటు ‘పూర్ణమ్మ’ వంటి రచనలను చదివి గురజాడ సాహిత్యంలోని సామాజిక సందేశాన్ని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని గురజాడ అప్పారావుకు నివాళులర్పించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI