Anakapalli: పారిశుద్ధ్య కార్మికుడికి ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించిన జనసేన!

Anakapalli: అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం వెదురుపర్తి ఎంపీటీసీ స్థానంలో పారిశుద్ధ్య కార్మికుడు పాలివెల్ల చిలకరావుకు జనసేన టికెట్ ఇచ్చి గెలిపించుకుంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 12 Nov 2026 9:39 PM IST
Anakapalli
X

Anakapalli: పారిశుద్ధ్య కార్మికుడికి ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించిన జనసేన!

అనకాపల్లి: సామాన్య కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా అనకాపల్లిలో మరో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఓ సామాన్య వ్యక్తికి ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, ఆయన విజయానికి నాయకత్వం వహించి జనసేన తన నిర్ణయాన్ని ఆచరణలో చూపించింది. అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం వెదురుపర్తి గ్రామ ఎంపీటీసీ స్థానం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో... అదే గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు పాలివెల్ల చిలకరావుకు జనసేన పార్టీ అవకాశం కల్పించింది.

ఈ విషయంలో అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రత్యేక చొరవ చూపగా... జనసేన పార్టీ అనకాపల్లి ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కీ కీలక పాత్ర పోషించారు. టికెట్ కేటాయింపుతో పాటు చిలకరావు గెలుపు కోసం రామ్కీ తన సొంత నిధులు సైతం వెచ్చించి అండగా నిలిచారు. ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికుడిని ప్రజాప్రతినిధిగా నిలబెట్టడంలో కొణతాల, రామ్కీ చూపిన చొరవ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా విజయం సాధించిన చిలకరావు భావోద్వేగంగా స్పందించారు. తమ తాతలు, తండ్రుల కాలం నుంచి కుటుంబమంతా పారిశుద్ధ్య వృత్తినే కొనసాగిస్తోందని, తాను కూడా అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నానని తెలిపారు. అలాంటి తనకు జనసేన పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కీతో పాటు గ్రామ పెద్దలు, తనకు అండగా నిలిచిన సోదరులు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చిలకరావు హామీ ఇచ్చారు. మొత్తంగా... రాజకీయాల్లో పదవులు కేవలం రాజకీయ నేపథ్యం ఉన్నవారికే పరిమితం కావని, సామాన్యులకు కూడా అవకాశాలు కల్పించవచ్చని ఈ పరిణామం చాటిచెబుతోంది.

పవన్ కళ్యాణ్ ఆశయం... కొణతాల రామకృష్ణ చొరవ... భీమరశెట్టి రామ్కీ సహకారం... వెరసి ఒక పారిశుద్ధ్య కార్మికుడికి ప్రజాసేవలో కొత్త వేదిక లభించింది. సామాన్యుడికి రాజకీయ అవకాశం... ప్రజాసేవకు కొత్త చిరునామా... ఇదేనా జనసేన రాజకీయాల అసలు లక్ష్యం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI