Anakapalli: వీవీ రమణ కాలనీలో నూతన రోడ్లు, డ్రైనేజీలు

Anakapalli: అనకాపల్లి బవులవాడ వీవీ రమణ కాలనీలో రూ. 1 కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 July 2026 8:48 PM IST
Anakapalli
X

Anakapalli: వీవీ రమణ కాలనీలో నూతన రోడ్లు, డ్రైనేజీలు

అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలోని బవులవాడ గ్రామం వీవీ రమణ కాలనీలో జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి (DMF) ద్వారా రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను శనివారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వారు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, అనకాపల్లి–చోడవరం ప్రధాన రహదారి నుంచి మాకవరం జంక్షన్ వరకు వీవీ రమణ కాలనీ మీదుగా సీసీ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో బవులవాడ, మాటూరు, సీహెచ్ అగ్రహారం తదితర మైనింగ్ ప్రాంతాల నుంచి వచ్చే భారీ క్వారీ లారీలను పట్టణంలోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే అవకాశం కలిగిందన్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తికావడంతో స్థానికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, అనకాపల్లి పట్టణంలో భారీ క్వారీ లారీల రాకపోకల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అంతేకాకుండా రహదారులు దెబ్బతినడం, విజయరామరాజుపేట రైల్వే బ్రిడ్జిని భారీ వాహనాలు పలుమార్లు ఢీకొనడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల పట్ల వీవీ రమణ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డీఈ, ఏఈలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story