Anakapalli: ఏనుగుతుని అభివృద్ధికి రూ.1.09 కోట్ల నిధులు కేటాయింపు!
Anakapalli: కశింకోట మండలం ఏనుగుతునిలో 'పల్లె పండుగ-3.0'లో భాగంగా రూ.1.09 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు.
Anakapalli: ఏనుగుతుని అభివృద్ధికి రూ.1.09 కోట్ల నిధులు కేటాయింపు!
Anakapalli: పల్లె పండుగ–3.0లో భాగంగా కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో సుమారు రూ.1.09 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో సుమారు రూ.50 లక్షల వ్యయంతో గ్రామ అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఏనుగుతుని నుంచి సోమవారం గ్రామం వరకు సుమారు రూ.45 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రూ.4 లక్షల వ్యయంతో రెండు గోకులాల నిర్మాణానికి, మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోందన్నారు.
కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, కశింకోట మండల కూటమి నాయకులు, గ్రామ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




