Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం!

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రూ. 22.25 కోట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం. ప్రారంభించిన కలెక్టర్ విజయ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 21 Sept 2026 9:59 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం!

అనకాపల్లి, సెప్టెంబర్ 21: పిఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) పథకం కింద రూ. 22.25 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో గత వారంలో ప్రారంభించారు.

ప్రజలకు అత్యవసర వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ తో కలసి, ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వివిధ రకాల వైద్య సేవలను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ వంటి అత్యవసర వైద్య సేవలన్నింటినీ ప్రజలకు మరింత చేరువ చేసేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ.... కేంద్ర ఆరోగ్య శాఖ మరియు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నెల 17న వర్చువల్‌గా ప్రారంభమైన క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) సేవలను స్థానికంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం క్యాజువాలిటీ (అత్యవసర విభాగం) సేవలతో పాటు దాదాపు 10 ఐసీయూ (ICU) బెడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.

రాబోయే రోజుల్లో సంపూర్ణ స్థాయి పరికరాలు, యంత్రాలు కేంద్రం నుండి రాగానే బెడ్ల సంఖ్యను 50 నుండి 60 వరకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆసుపత్రిలోని ఓపీ (OP) సేవలు, అత్యవసర విభాగాలను వేరు చేయడం ద్వారా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందిస్తారని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ ప్రత్యేక ఆక్సిజన్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్., డా.శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అచ్యుతకుమారి, వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM