Revupolovaram: రేవుపోలవరం తీరంలో పోలీసుల అప్రమత్తత
Revupolovaram: రేవుపోలవరం తీరంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తత. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక, ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు.
Revupolovaram: రేవుపోలవరం తీరంలో పోలీసుల అప్రమత్తత
ఎస్.రాయవరం: భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాలు, పర్యవేక్షణలో తీర ప్రాంతాల్లో ముందస్తు రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరంలో పోలీసు, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి.
నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, APSDRF రెస్క్యూ బృందాలు రేవుపోలవరం తీర ప్రాంతంలో ప్రత్యేక గస్తీ నిర్వహించారు. సముద్రపు అలల ఉధృతి, వాతావరణ పరిస్థితులను అధికారులు స్వయంగా పరిశీలించారు.
తుఫాను ప్రభావంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తక్షణమే సహాయక చర్యలు చేపట్టేందుకు SDRF బృందాలు సిద్ధంగా ఉండేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతంలో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రజలు, మత్స్యకారులతో అధికారులు మాట్లాడి తుఫాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తీర ప్రాంతాలతో పాటు లోతట్టు గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా సంబంధిత అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తక్షణ రక్షణ, సహాయక చర్యలు అందించేందుకు పోలీసు యంత్రాంగం, APSDRF బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో నర్సీపట్నం డీఎస్పీ, నక్కపల్లి రూరల్ సీఐ, ఎస్.రాయవరం ఎస్సై, పోలీసు సిబ్బంది, APSDRF రెస్క్యూ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.




